తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. ఈ క్రమంలో బీజేపీ తరఫున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయనున్నట్టు ప్రకటించడంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
“పవన్ కళ్యాణ్ ఓ దిష్టి కల్యాణ్” అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణపై నీచంగా మాట్లాడారని, తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఇప్పుడు ఇక్కడ ప్రచారం చేయడం సరికాదని మహేష్ గౌడ్ విమర్శించారు. పవన్ చెప్పారని తెలంగాణ ప్రజలు ఓట్లు వేయరని, ఆయన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లోనే చేసుకోవాలని హితవు పలికారు.
గతంలో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి “తెలంగాణ వాళ్ల దిష్టి తగిలింది” అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, దానికి ప్రతిగా ఇప్పుడు “పవన్ కళ్యాణే ఓ దిష్టి” అని మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని, అలాంటి నేతకు ఇక్కడ ప్రచారం చేసే హక్కు లేదని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.
మరోవైపు పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రచారంతో బీజేపీకి ఎంతవరకు లాభం చేకూరుతుందన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలతో పవన్ ప్రచారం మరింత వివాదాస్పదంగా మారగా, తెలంగాణ వాసులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని ఆ రాష్ట్ర ప్రజలు ఒప్పుకుంటారా..? అనేది ప్రశ్న.








