నిందితుల‌ను రోడ్డుపై న‌డిపిస్తారా..? పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

నిందితుల‌ను రోడ్డుపై న‌డిపిస్తారా..? పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

Summarize with AI

నిందితులను నడి రోడ్డుపై నడిపిస్తూ, బహిరంగ ప్ర‌దేశాల్లో తిప్పుతూ అవమానించే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (PIL)పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, “పోలీసులు ఇలా ఎలా వ్యవహరిస్తారు?” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. పోలీసులు ప్రజలతో వ్యవహరించే తీరు బాధ్యతాయుతంగా ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది.

పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు నిందితుల పట్ల చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. నిందితులను రోడ్లపై నడిపించడం, బహిరంగంగా కొట్టడం, తిట్టడం వంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయని తెలిపారు. ఈ మేరకు పలు వీడియోలు, ఫోటోలను న్యాయమూర్తికి సమర్పించారు.

కొవ్వూరు ఘటనపై ప్రభుత్వం తరఫున వివరణ ఇస్తూ, నిందితుడిని తీసుకువెళ్లే వాహనం బ్రేక్‌డౌన్ కావడంతో రోడ్డుపై నడిపించాల్సి వచ్చిందని, ఆ సమయంలో ఫోటోలు తీయబడినట్లు కోర్టుకు తెలియజేశారు. అయితే, ఇలాంటి ఘటనలు ఒక్కటే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తరచుగా జరుగుతున్నాయని పిటిషనర్ వాదించారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైన చర్య అని స్పష్టం చేశారు.

విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కొన్ని వీడియోల్లో పోలీసులు ఇష్టారీతిన నిందితులను తిట్టడం, దురుసుగా ప్రవర్తించడం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని బాధ్యతారాహిత్యంగా వ్యవహరించకూడదని స్పష్టం చేసింది. ప్రజల హక్కులు, నిందితుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా పోలీసులు ప్రవర్తించరాదని హెచ్చరించింది.

న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ వ్యవహారంపై సమగ్రంగా స్పందించాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ, కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. పోలీసులు చట్ట పరిమితుల్లోనే పని చేయాలన్న సందేశాన్ని ఈ విచారణ మరోసారి బలంగా చాటింది.

Join WhatsApp

Join Now

Leave a Comment