రాష్ట్రంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. మద్యం అక్రమ కేసులో బెయిల్‌పై విడుదలైన వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నాయుడుపేట–చిత్తూరు జాతీయ రహదారిపై పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఘన స్వాగతం పలికాయి.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విడుదల అనంతరం నిర్వహించిన ర్యాలీ చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయంగా కలకలం రేపింది. వేలాదిగా తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలు, అభిమానులతో జరిగిన ఈ ర్యాలీ కూటమి ప్రభుత్వ నాయకుల్లో వెన్నులో వణుకు పుట్టించిందని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే, ఈ ర్యాలీని అడ్డుపెట్టుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి సహా మొత్తం 40 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ర్యాలీ సందర్భంగా భారీగా ట్రాఫిక్ జామ్‌కు కారణమయ్యారంటూ పోలీసులు కేసు కట్టడం గమనార్హం. ఈ మేరకు తిరుచానూరు పోలీస్ స్టేషన్, తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌లలో రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదు చేయడం కూటమి ప్రభుత్వ దురుద్దేశ్యానికి నిదర్శనమని పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ప్రజల్లో ఉన్న ఆదరణను తట్టుకోలేకే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సంఘటనలను అణచివేయాలని చూస్తే ఉద్యమాలు మరింత బలపడతాయని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలో శాంతియుతంగా కార్యక్రమాలు నిర్వహించే హక్కును కూడా హరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ కక్ష్య సాధింపు రాజకీయాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వైసీపీ స్పష్టం చేసింది.








