ఖమ్మం తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం. ఖమ్మం జిల్లాకు చెందిన వైసీపీ అభిమానులు, కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. ఇటీవల వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన భారీ ర్యాలీ నేపథ్యంలో తమపై నమోదైన కేసులపై వారు జగన్‌కు ఫిర్యాదు చేశారు.
జగన్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఖమ్మంలో ర్యాలీ నిర్వహించారనే కారణంతో ఏకంగా 11 మంది వైసీపీ అభిమానులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసి, అందులో 8 మందిని 13 రోజుల పాటు రిమాండ్‌కు పంపిన విషయాన్ని వారు వివరించారు. ఈ కేసులు ఖమ్మంకు చెందిన ఓ మంత్రి, ఆయన తనయుడి ప్రమేయంతోనే పెట్టారని, రాజకీయ కక్షతో తమను లక్ష్యంగా చేసుకుని నాన్‌బెయిలబుల్ సెక్షన్లు పెట్టి జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ స్పందిస్తూ.. తెలంగాణలో వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, పార్టీ క్యాడర్ ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పార్టీ తరఫున అవసరమైన న్యాయసహాయం పూర్తిగా అందిస్తామని, ఇందుకోసం పార్టీ లీగల్ సెల్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసినా, చట్టబద్ధంగా పోరాడి న్యాయం సాధిస్తామని జగన్ స్పష్టం చేశారు.
ఈ భేటీలో వైసీపీ సీనియర్ నేత పుత్తా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా అభిమానులు ఆలస్యం సుధాకర్, మర్రి శ్రీనివాస్, యర్రా నాగరాజు రెడ్డి, గంగారపు మురళీ, సరికొండ రామరాజు, గంగరబోయిన రవి, పగిళ్ళ నాగేష్, ముదిరెడ్డి శివారెడ్డి పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో వైసీపీ కార్యకర్తలపై నమోదైన కేసులు, రాజకీయ వేధింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.








