మహారాష్ట్ర రాష్ట్రాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తిన ఘోర విమాన ప్రమాదం బుధవారం ఉదయం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం బారామతి విమానాశ్రయం సమీపంలో కూలిపోవడంతో ఆయనతో పాటు మరో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
సమాచారం ప్రకారం, ఉదయం సుమారు 8:45 గంటలకు ముంబైకి చెందిన VSR వెంచర్స్ సంస్థకు చెందిన ప్రైవేట్ చార్టర్డ్ విమానం బారామతి ఎయిర్పోర్ట్ సమీపంలో అకస్మాత్తుగా కుప్పకూలింది. అజిత్ పవార్‌తో పాటు ఇద్దరు పైలెట్లు, ఇద్దరు భద్రతా సిబ్బంది ఉన్నారు. ప్రమాదంలో అందరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే విమానం పూర్తిగా ధ్వంసం కావడంతో ప్రాణాలు కాపాడే అవకాశం లేకపోయింది. అజిత్ పవార్ మృతి వార్త వెలువడగానే మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ నేతలు, ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పెరుగుతున్న విమాన ప్రమాదాలు… ప్రజల్లో భయాందోళన
ఇటీవలి కాలంలో దేశంలో వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. విమాన ప్రయాణం చేయాలంటేనే వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన 787-8 విమాన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులతో పాటు, విమానం కూలిన మెడికల్ కాలేజీ హాస్టల్లో భోజనం చేస్తున్న విద్యార్థులు కూడా మృతి చెందిన ఘటన దేశాన్ని కుదిపేసింది.
విమాన ప్రమాదాలు తరచూ జరుగుతున్నా, వాటిని నివారించడంలో సంబంధిత శాఖ తగిన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విమానయాన శాఖ పనితీరుపై, శాఖ మంత్రిపై గతంలోనే ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శాఖపై కంటే రాజకీయ నాయకుల సేవలపైనే ఎక్కువ దృష్టి పెట్టుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో అయినా విమాన భద్రతపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందా? అన్న ప్రశ్నలు సామాన్యుల మనసుల్లో మెదులుతున్నాయి.








