విజయ్ పార్టీ ఎన్నిక‌ల గుర్తు కేటాయింపు

విజయ్ పార్టీ ఎన్నిక‌ల గుర్తు కేటాయింపు

తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) సమీపిస్తున్న నేపథ్యంలో స్టార్ హీరో విజయ్ (Vijay) స్థాపించిన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) (Tamilaga Vettri Kazhagam – TVK)కి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త అందించింది. టీవీకే పార్టీకి అధికారికంగా విజిల్ (Whistle) గుర్తును కేటాయించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఇటీవల ‘జననాయగన్’ సినిమా వివాదం, సీబీఐ విచారణ వంటి సంక్లిష్ట పరిస్థితుల మధ్య ఉన్న విజయ్, తన పార్టీకి ఉమ్మడి ఎన్నికల గుర్తు కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. దీనిపై పరిశీలించిన ఈసీ, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా అన్ని అర్హతలు పూర్తయ్యాయని నిర్ధారించి టీవీకేకు విజిల్ గుర్తును కేటాయించింది.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే గానీ, బీజేపీతో గానీ ఎలాంటి పొత్తులు పెట్టుకోబోమని విజయ్ ఇప్పటికే స్పష్టంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే కూటమి, ఏఐఏడీఎంకే–బీజేపీ కూటమి, నామ్ తమిళ్ కట్చి, టీవీకే మధ్య చతుర్ముఖ పోటీ తప్పనిసరి అవుతుందన్న అంచనాలు బలపడుతున్నాయి.

కొత్తగా రాజకీయ బరిలోకి దిగుతున్న పార్టీగా టీవీకేకు ఉమ్మడి గుర్తు అత్యంత కీలకమని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీవీకే సమర్పించిన దరఖాస్తును కేంద్ర ఎన్నికల సంఘం సవివరంగా పరిశీలించి విజిల్ గుర్తును కేటాయించినట్లు సమాచారం. అవసరమైన అన్ని వివరాలు, సభ్యత్వ గణాంకాలు, పార్టీ నిర్మాణానికి సంబంధించిన సమాచారాన్ని టీవీకే ఈసీకి సమర్పించినట్లు వెల్లడైంది.

విజిల్ గుర్తు కేటాయింపుతో టీవీకే పార్టీకి రాజకీయంగా మరింత బలం చేకూరనుందని, తమిళనాడు రాజకీయాల్లో విజయ్ పాత్ర మరింత కీలకంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment