అమ‌రావ‌తిని ‘మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్’గా మార్చారు – స‌జ్జ‌ల‌

అమ‌రావ‌తిని ‘మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్’గా మార్చారు - స‌జ్జ‌ల‌

అమరావతి (Amaravati)లో అన్యాయం, అవినీతి జరుగుతుంటే ప్రశ్నించడంలో తప్పేముందని, అమరావతి అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా డైవర్ట్ చేస్తున్నార‌ని వైసీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబు తనకు అనుకూలమైన కంపెనీలకే కాంట్రాక్టులు కట్టబెట్టి, వాటి నుంచి 4 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. మొబలైజేషన్ అడ్వాన్స్‌ల పేరుతో బాబు అండ్ కో అమ‌రావ‌తిలో దోపిడీ చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

అమరావతిని ‘మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్’ (Mother of All Scams)గా చంద్రబాబు మార్చారని సజ్జల అభిప్రాయ‌ప‌డ్డారు. అమరావతిలో నీళ్లు తోడటానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. వైఎస్ జగన్ అమరావతి ప్రాంతానికి ఎప్పుడూ వ్యతిరేకి కాదని సజ్జల స్పష్టం చేశారు. 2019కి ముందే అమరావతిలో ఇల్లు, పార్టీ కార్యాలయం కట్టారని, రాజధానిగా ప్రకటించిన తర్వాత అక్కడే నివాసం ఉన్నారని వివ‌రించారు. అయితే చంద్రబాబు ఇప్పటికీ అమరావతిలో ఇల్లు కట్టుకోలేదని, అక్రమ నివాసంలో ఉంటున్నారని విమర్శించారు. అమరావతిలో లిఫ్ట్‌లు, నీటి ప్రాజెక్టులకు వేల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

తాము ఎప్పుడూ అమరావతిని తక్కువ చేయలేదని, అమరావతి పేరుతో జరుగుతున్న స్కామ్‌లను మాత్రమే ప్రశ్నిస్తున్నామని సజ్జల స్పష్టం చేశారు. విశాఖను పరిపాలనా కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని అన్నారు. రూ. లక్ష కోట్ల అప్పుకు ఏటా రూ. 8 వేల కోట్ల వడ్డీ భారం పడుతుందని, దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అరుపులు, బెదిరింపులతో కాదు… సూటిగా సమాధానం ఇవ్వాలని హితవు పలికారు.

రాయలసీమ ప్రయోజనాల విషయంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని సజ్జల ఆరోపించారు. శ్రీశైలం నుంచి తెలంగాణ రోజుకు 8 టీఎంసీల నీటిని వినియోగించుకుంటున్నప్పటికీ, రాయలసీమ హక్కులపై చంద్రబాబు నోరు మెదపడం లేదన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మౌనం వహించడం అంటే అవి నిజమేనని అర్థం చేసుకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజంతో నిజాలను ప్రజల దృష్టికి రానివ్వడం లేదని విమర్శించారు.

విష, అబద్ధపు ప్రచారంలో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారని సజ్జల ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ హయాంలో తీసుకొచ్చిన పాస్‌బుక్ క్యూఆర్ కోడ్‌ను ఇప్పుడు తమ ఆవిష్కరణగా ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు. చంద్రబాబు అరాచక పాలన నుంచి ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. జగన్ హయాంలో తీసుకున్న అప్పుల్లో ఎక్కువ భాగం నేరుగా ప్రజలకు డీబీటీ రూపంలో ఇచ్చామని, కానీ చంద్రబాబు రెండేళ్లలోనే రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి ప్రజలపై భారం మోపుతున్నారని సజ్జల తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment