రంగంలోకి వాటర్ అంబ్రెల్లా.. 24 గంట‌ల త‌ర్వాత‌ మంట‌లు తగ్గుముఖం

రంగంలోకి వాటర్ అంబ్రెల్లా.. 24 గంట‌ల త‌ర్వాత‌ మంట‌లు తగ్గుముఖం

Summarize with AI

ప‌చ్చ‌ని ప్రాంతాన్ని ONGC బ్లో అవుట్ అతలాకుత‌లం చేసింది. 100 మీట‌ర్ల ఎత్తుకు ఎగిసిప‌డిన మంట‌లు భ‌య‌భ్రాంతుల‌కు గురిచేశాయి. దీంతో స‌మీప ప్రాంత ప్ర‌జ‌ల గ్రామాల‌ను విడిచిపెట్టి వెళ్లే దారుణ ప‌రిస్థితి ఏర్ప‌డింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా (Dr. B.R. Ambedkar Konaseema District) మలికిపురం మండలం ఇరుసుమండ (Irusumanda)లో జరిగిన ONGC బ్లో అవుట్ ఘటన క్రమంగా తగ్గుముఖం పడుతోంది. నిన్న మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఎగసిపడిన మంటలు ప్రస్తుతం చాలా వరకు అదుపులోకి వస్తున్నాయి. అయినప్పటికీ పూర్తిస్థాయిలో ప్రమాదాన్ని నివారించేందుకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

బావి వద్ద ఏర్పడిన తీవ్ర మంటలను నియంత్రించేందుకు ONGC అధికారులు ‘వాటర్ అంబ్రెల్లా’ (Water Umbrella) విధానాన్ని వినియోగిస్తున్నారు. నాలుగు వైపులా భారీగా నీటిని విరజిమ్ముతూ ఉష్ణోగ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. బ్లో అవుట్ కారణంగా అక్కడ 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవగా, ఈ విధానం ద్వారా వేడిని క్రమంగా తగ్గిస్తున్నారు. బావిలో సుమారు 40 వేల క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

ఈ ఘటనలో మంటల ధాటికి వందలాది కొబ్బరి చెట్లు కాలిపోయాయి. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో సమీప గ్రామాలను అధికారులు ముందస్తుగా ఖాళీ చేయించారు. దీంతో ఇరుసుమండ గ్రామ ప్రజలు రాత్రంతా భయాందోళనల మధ్య అంధకారంలో గడపాల్సి వచ్చింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది.

మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు ONGC విస్తృత స్థాయిలో సహాయక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం 20 మంది ONGC అధికారులు, 60 మంది ఫైర్ సిబ్బంది ఘటన స్థలంలో పనిచేస్తున్నారు. నరసాపురం యూనిట్ నుంచి అదనంగా మరో 20 మంది ఇంజినీర్లు చేరారు. అంతేకాకుండా ఢిల్లీ (Delhi) నుంచి నిపుణుల బృందం కూడా రానుందని అధికారులు తెలిపారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు నిరంతర చర్యలు కొనసాగుతాయని ONGC స్పష్టం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment