తెలంగాణలో (Telangana) సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) విచారణలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఈ కేసులో నిందితులందరినీ ఒకేసారి విచారించేందుకు సిట్(SIT) (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) సిద్ధమైంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు హాజరుకావాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ప్రభాకర్‌రావుతో (Prabhakar Rao) పాటు ప్రణీత్‌రావు, భుజంగరావు, రాధాకిషన్‌రావు, తిరుపతన్నలను కూడా విచారణకు పిలిచారు. ప్రభాకర్‌రావు కస్టడీ ఇవాళ్టితో ముగియనున్న నేపథ్యంలో, అన్ని కీలక నిందితులను ఒకేసారి ఎదురెదురుగా ప్రశ్నించాలని సిట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ (KCR) ప్రెస్‌మీట్‌తో కాంగ్రెస్ సర్కార్ గ్రాఫ్ తీవ్రంగా పడిపోవడంతో ఎలాగైనా కీలక నేతలను అరెస్ట్ చేసి టాపిక్ డైవర్ట్ చేయాలనే ఆలోచన ప్రభుత్వం ఉన్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కస్టడీలో చెప్పిందేమిటి?
14 రోజుల పాటు కస్టడీలో ఉన్న ప్రభాకర్‌రావు విచారణలో మెజార్టీ ప్రశ్నలకు “NO” అనే సమాధానమే ఇచ్చినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నేరుగా జవాబులు ఇవ్వకుండా తప్పించుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పటి డీజీపీ(DGP) మహేందర్‌రెడ్డి (Mahender Reddy)తో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్‌లు నవీన్ చంద్, అనిల్ పేర్లను ప్రభాకర్‌రావు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే 6 వేల ఫోన్ నంబర్లు ఉన్నట్లు చెబుతున్న పెన్‌డ్రైవ్ అంశంపై మాత్రం ఆయన నోరు మెదపకపోవడం దర్యాప్తు అధికారులకు అనుమానాలను పెంచుతోంది. మావోయిస్టుల అంశంపైనే మాజీ మంత్రి హరీష్‌రావు (Harish Rao) తనతో మాట్లాడారని ప్రభాకర్‌రావు వివరణ ఇచ్చారు. అయితే కేసీఆర్ తనకు రీఎంప్లాయిమెంట్ ఎలా ఇచ్చారన్న విషయంపై మాత్రం మౌనం పాటించినట్లు సమాచారం.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో ఫోన్ ట్యాపింగ్ లింక్?
ఈ కేసులో మరో కీలక పరిణామంగా దక్కన్ కిచెన్ యజమాని నంద కుమార్‌ను కూడా సిట్ విచారణకు పిలిచింది. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే అరెస్టైన నంద కుమార్‌ను, ఆ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చిందన్న అంశంపై ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటపడిందా? అన్న కోణంలో సిట్ లోతుగా విచారణ చేపట్టింది. ఫామ్ హౌస్‌లో ఆడియో, వీడియోలు ఎలా రికార్డు అయ్యాయి? అవి బయటకు ఎలా వచ్చాయి? అనే అంశాలపై నంద కుమార్ (Nand Kumar) స్టేట్మెంట్ను నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నంద కుమార్ కీలక వ్యాఖ్యలు
విచారణ అనంతరం నంద కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఆడియోలు బయటకు రావడం ఒక ఎత్తయితే, తాను సింహాయాజీ, రామచంద్ర భారతి, స్వామీజీలతో మాట్లాడిన ఫోన్ సంభాషణలు కూడా బయటకు రావడం ట్యాపింగ్ జరిగిందనే అనుమానాలకు బలమిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
రాజకీయంగా పెరుగుతున్న ఉత్కంఠ
ఫోన్ ట్యాపింగ్ కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రెండూ పరస్పరం ముడిపడి ఉన్నాయా? ఎవరి ఆదేశాలతో ఈ వ్యవహారం నడిచింది? అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇవాళ జరగనున్న సమిష్టి విచారణలో సిట్‌కు ఎలాంటి కీలక ఆధారాలు లభిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.








