ప్రైవేట్ వ్య‌క్తుల‌కు టీటీడీ భూమి.. చంద్రబాబుపై భూమన ఫైర్‌

ప్రైవేట్ వ్య‌క్తుల‌కు టీటీడీ భూమి.. చంద్రబాబుపై భూమన ఫైర్‌

తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) చంద్ర‌బాబు ప్ర‌భుత్వం (Chandrababu Naidu Government) ఘోరమైన ద్రోహం చేస్తోంద‌ని టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి (Bhumana Karunakar Reddy) అన్నారు. పవిత్రమైన తిరుపతి (Tirupati) చంద్రబాబు ప్రభుత్వం ఓబెరాయ్ హోటల్‌కు కేటాయించిన భూములను భూమన కరుణాకర్‌రెడ్డి పరిశీలించి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అత్యంత విలువైన టీటీడీ భూములను (TTD Lands) ప్రైవేట్ హోటల్ గ్రూపున‌కు కట్టబెట్టడం అత్యంత దారుణమని ఆయన వ్యాఖ్యానించారు.

అలిపిరికి అత్యంత సమీపంలో, ఏడు కొండల పరిధిలోనే ఉన్న ఈ భూములను ఓబెరాయ్ గ్రూపున‌కు (Oberoi Hotel Group) కేటాయించారని భూమన ఆరోపించారు. టూరిజం శాఖ భూమి ఎకరాకు మార్కెట్ విలువ రూ.90 లక్షలు మాత్రమే కాగా, టీటీడీకి చెందిన భూమి గజం రూ.49 వేల విలువ ఉందని, ఎకరాకు సుమారు రూ.26 కోట్లుగా లెక్కిస్తే 20 ఎకరాల భూమి విలువ రూ.460 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. బహిరంగ మార్కెట్లో ఈ భూముల విలువ రూ.3 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఇంత విలువైన భూములను తక్కువ ధరకు ప్రైవేట్ సంస్థకు ధారాదత్తం చేయడం ఘోరమైన అవినీతిగా ఆయన అభివర్ణించారు.

100 రూముల హోటల్‌తో 1500 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెబుతుండటం అబద్ధమని, 100 రూములు క‌డితే 1500 ఉద్యోగాలు ఎలా వ‌స్తాయ‌ని ప్ర‌శ్నించారు. 5 స్టార్ హోటల్‌కు పేరు మార్చి వేల కోట్ల విలువైన ఆస్తిని ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారని భూమన ఆరోపించారు. ఇది పరకామణి దొంగతనం కంటే పెద్ద దోపిడీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ భూములు ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఉన్నాయని, ఎర్రచందనం చెట్లు, విలువైన వనరులు అక్కడ ఉన్నాయని తెలిపారు. వెంకటేశ్వర స్వామి స్థలాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ స్వామీజీలు, ప్రజలు మౌనం వీడి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించాలని భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ నెల 11న క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని 13న జీవో జారీ చేశారని, కానీ ఇప్పటివరకు అది ఆన్‌లైన్‌లో కనిపించడం లేదని భూమన ప్రశ్నించారు. అంతేకాదు, ఈ నెల 5న రిజిస్ట్రేషన్ జరిగిందని, కానీ ప్రజలకు పారదర్శకంగా వివరాలు వెల్లడించలేదని విమర్శించారు. లీజు డీడ్ మనీ మాఫీ చేయడం, రూ.26 కోట్ల స్టాంప్ డ్యూటీ మినహాయించడం ద్వారా ప్రభుత్వమే ప్రైవేట్ సంస్థకు భారీ లాభం చేకూర్చిందన్నారు. ఈ వ్యవహారం మొత్తం భగవంతుడు ఇచ్చిన‌ ఇనాం భూములను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడమేనని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment