వయస్సు ప్రజాసేవకు అడ్డంకి కాదని మరోసారి నిరూపించారు సూర్యాపేట జిల్లా (Suryapet District) నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా (Sarpanch) ఎన్నికైన రామచంద్రారెడ్డి (Ramachandra Reddy). 95 ఏళ్ల వయస్సులో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించడం ద్వారా రాష్ట్రంలోనే అత్యధిక వయస్సు కలిగిన సర్పంచ్‌గా ఆయన రికార్డు సృష్టించారు. ఈయన ఎవరో కాదు.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) సీనియర్ లీడర్ జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) తండ్రి.
నాగారం గ్రామస్తులకు (Villagers of Nagaram) రామచంద్రారెడ్డి అంటే నాయకుడు కాదు.. కుటుంబ పెద్ద. ప్రేమతో ఆయన్ను ‘బాపూ’గా (Bapu) పిలుచుకుంటారు. గ్రామస్తుల అభ్యర్థన మేరకు ఆయన సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ యువ అభ్యర్థులతో పోటీ చేయాలని నిర్ణయించారు. ఫలితంగా ఈ పోటీ పూర్తిగా ఏకపక్షంగా మారింది. 180 ఓట్ల మెజారిటీతో రామచంద్రారెడ్డి ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు.
ప్రజాసేవకు వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని రామచంద్రారెడ్డి తన జీవితం ద్వారా చూపిస్తున్నారు. 95 ఏళ్ల వయస్సులోనూ యువకులకంటే చురుకుగా, ఉత్సాహంగా ఉండే ఆయనకు చిన్ననాటి నుంచే సామాజిక సేవే లక్ష్యం. సొంత గ్రామానికి సర్పంచ్‌గా సేవ చేయాలన్న తన చిరకాల కోరికను ఇప్పుడు నెరవేర్చుకున్నారు. గ్రామాభివృద్ధికే తన శేష జీవితాన్ని అంకితం చేస్తానని రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. 95 ఏళ్ల వయస్సులో సర్పంచ్ బాధ్యతలు చేపట్టిన ఈ పెద్దాయన, పదవీకాలం ముగిసే నాటికి వయస్సులో ‘సెంచరీ’ కొట్టనున్నారు.








