కోల్‌కతాలో మెస్సీ ఫ్యాన్స్‌ వీరంగం.. స్టేడియంలో అరాచ‌కం

కోల్‌కతాలో మెస్సీ ఫ్యాన్స్‌ వీరంగం.. స్టేడియంలో అరాచ‌కం

ఫుట్‌బాల్ ప్రపంచ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) 14 ఏళ్ల తర్వాత భారత పర్యటనకు రావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రేపింది. శనివారం తెల్లవారుజామున 2:30 గంటలకు మెస్సీతో పాటు ఉరుగ్వే స్టార్ లూయిస్ సువారెజ్, అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ రోడ్రిగో డి పాల్ కోల్‌కతా (Kolkata) విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ (Shah Rukh Khan) సమక్షంలో మెస్సీ తన 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని వర్చువల్‌గా ఆవిష్కరించడంతో నగరం మొత్తం ఫుట్‌బాల్ ఫీవ‌ర్‌తో ఉక్కిరిబిక్కిరి అయింది.

అయితే ఈ ఉత్సవ వాతావరణం సాల్ట్‌లేక్ స్టేడియంలో (Salt Lake Stadium) ఒక్కసారిగా గందరగోళంగా మారింది. మెస్సీని సమీపంగా చూడలేకపోయిన కొందరు అభిమానులు నిరాశతో భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ మైదానంలోకి దూసుకెళ్లారు. అభిమానుల ఆవేశం అదుపు తప్పడంతో స్టేడియంలో అరాచకం చోటుచేసుకుంది. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో, మెస్సీ కేవలం 22 నిమిషాల్లోనే స్టేడియం విడిచిపెట్టి వెనుదిరగాల్సి వచ్చింది.

‘సిటీ ఆఫ్ జాయ్’గా (City of Joy) పేరొందిన కోల్‌కతాలో ఫుట్‌బాల్ అభిమానులకు ఇది ఒక చిరస్మరణీయ క్షణంగా మిగలాల్సిన రోజు. కానీ, అభిమానుల వీరంగం కారణంగా ఆ రోజు పీడ కలగా మారిపోయింది. కార్యక్రమం మధ్యలోనే నిలిపివేయడంతో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly), పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సైతం మెస్సీని ప్రత్యక్షంగా కలుసుకోలేకపోయారు.

పరిస్థితి తీవ్రతను గమనించిన జీఓఏటీ టూర్ నిర్వాహకులలో ఒకరైన శతద్రు దత్తా (Shatadru Dutta), భద్రతా సిబ్బందితో కలిసి మెస్సీని సురక్షితంగా స్టేడియం నుంచి బయటకు తరలించారు. రూ.4,500 నుంచి రూ.10,000 వరకు టిక్కెట్లు కొనుగోలు చేసిన అభిమానులు తీవ్ర నిరాశకు గురై తమ ఆగ్రహాన్ని సీట్లు ధ్వంసం చేయడం, నీళ్ల సీసాలు విసిరేయడం ద్వారా వ్యక్తం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

Join WhatsApp

Join Now

Leave a Comment