జమిలి ఎన్నికల (వన్ నేషన్ – వన్ ఎలక్షన్)పై కేంద్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే నేడు ఈరోజు పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ పరిణామం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నేతృత్వంలోని NDA పూర్తిగా జమిలికి మద్దతు తెలిపినా, ఎన్నికలు మాత్రం 2029లోనే అంటూ చంద్రబాబు ఇటీవల వ్యాఖ్యానించారు. మరోవైపు తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు స్పష్టంగా వ్యతిరేకత ప్రకటించింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మరియు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మాత్రం జమిలి ఎన్నికల పక్షాన ఉన్నట్లు సమాచారం.
జమిలి ఎన్నికల ద్వారా ముందుగానే ఎన్నికలు జరగవచ్చనే అభిప్రాయంతో ఈ పార్టీలు ఉన్నాయి. తెలంగాణలో అధికార కాంగ్రెస్‌పై ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని బీఆర్ఎస్ ఆలోచనగా తెలుస్తోంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోనూ అధికారం చేపట్టి 6 నెలలు దాటినా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్, ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ పబ్బం గడుపుకుంటుందని వైసీపీ వాదన.
ఇదిలా ఉండగా, జమిలి ఎన్నికలు జరిగితే ఏపీలో తమదే అధికారమని, అందుకు ప్రధాన కారణం చంద్రబాబు ప్రభుత్వ వైఖరేనని, ఇప్పటికే ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకత ఆగ్రహంగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైసీపీ అంటోంది. జమిలి ద్వారా ప్రజల్లో తమ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవాలని ఇరు పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.