రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన విందుకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గేలకు ఆహ్వానం రాకపోవడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆశ్చర్యకరంగా, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్‌కు మాత్రం ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానాన్ని స్వీకరించిన థరూర్ విందుకు హాజరయ్యారు.
విందు సమయంలో రాష్ట్రపతి భవన్‌లో థరూర్–నిర్మలా సీతారామన్ మాట్లాడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుతూ కనిపించిన వీడియో రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. ముఖ్యంగా కాంగ్రెస్ టాప్ లీడర్లకు ఆహ్వానం లేకపోవడం, థరూర్ హాజరవడం కొత్త సందేహాలకు దారి తీసింది.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. పార్టీ నేత పవన్ ఖేరా స్పందిస్తూ.. “మన ప్రధాన నాయకులను ఆహ్వానించకపోతే, పార్టీకి చెందిన మరొక నేత ఎలా హాజరవుతారు?” అంటూ ప్రశ్నించారు. ఖేరా వ్యాఖ్యలు కాంగ్రెస్ లోపలున్న అసంతృప్తిని బయటపెట్టాయి. థరూర్ హాజరైన విషయంపై పార్టీ వర్గాల్లో వివిధ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇక రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ..విదేశీ నాయకులు భారత్‌కి వచ్చినప్పుడు ప్రతిపక్షంతో సమావేశమవడం ఒక ఆచారం అని, కానీ ఇప్పుడు తనను కలవొద్దని ప్రభుత్వమే సూచనలు ఇస్తోందని అన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ రాహుల్ వ్యాఖ్యలను ఖండించింది. ప్రతిపక్ష నేతగా ఆయన ఇప్పటికే పలువురు విదేశీ నాయకులను కలిసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.









విమానయానంలో ఇండిగో, ఎయిర్ఇండియా ఆధిపత్యం!