ఏపీలోని కూటమి ప్రభుత్వ తాజా చర్య అన్నదాతలకు ఆగ్రహాన్ని, సినీ ప్రేక్షకులకు అసహనం తెప్పిస్తోంది. ఒకవైపు అన్నదాత శ్రమకు కనీస విలువ దక్కక, కిలో అరటిపండు ధర కేవలం 50 పైసల నుంచి రూ.1 మాత్రమే పలుకుతుంటే, మరోవైపు వినోదం కోసం విడుదలవుతున్న ‘అఖండ 2’ సినిమా ప్రీమియర్ షో టికెట్‌ను ఏపీ ప్రభుత్వం ఏకంగా రూ.600 పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
లక్షల పెట్టుబడితో పంట పండించిన రైతులు గిట్టుబాటు ధర లేక, రవాణా ఖర్చు కూడా భరించలేక పంటను రోడ్డు పక్కన పారబోసే దయనీయ స్థితిలో ఉన్నారు. ఈ సంక్షోభ సమయంలో అన్నదాతలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, కనీస మద్దతు ధర (MSP) కల్పించలేక వారిని అప్పుల ఊబిలోకి నెట్టివేస్తోందనే ఆరోపణలున్నాయి.
ప్రాధాన్యత వినోదానికా.. వ్యవసాయానికా?
కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన సినిమాకు మరింత అధిక లాభాలు కల్పించేందుకు ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. డిసెంబర్ 4న ప్రీమియర్ షో కోసం ఏకంగా రూ.600, ఆ తర్వాత 10 రోజుల పాటు అదనపు ధరలు వసూలు చేయాలని జీఓ జారీ చేయడం మధ్యతరగతి సినీ అభిమానులకు తీవ్ర భారం. సినిమా అనేది వినోదం కోసమే కానీ, సామాన్య ప్రేక్షకుల జేబులకు చిల్లుపెట్టేందుకు కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మొన్న ఓజీ.. ఇవాళ అఖండ-2
గతంలో ఉల్లి, మామిడి రైతులు తమ పంటలకు రవాణా ఖర్చు అయినా కల్పించాలని రోడ్డెక్కి వేడుకున్న సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ ధరను భారీగా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ అఖండ-2 సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో వినోదానికి భారీ ధరలు అనుమతిస్తూ, రాష్ట్రానికి అన్నపూర్ణ ఆంధ్రగా పేరుతెచ్చిన రైతు కష్టానికి మాత్రం కనీస విలువ కల్పించకపోవడంపై ఏపీ ప్రభుత్వం అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు భారీ బ్లాక్ బస్టర్ సినిమా నిర్మాతలకు, మరోవైపు కష్టజీవులైన రైతులకు ప్రభుత్వం చూపిస్తున్న ఈ వైరుధ్యం తీవ్ర సందేహాలకు తావిస్తోంది.
ఒక అరటిపండు ధర రూ. 0.50 పైసలు ఉన్నప్పుడు, అదే రాష్ట్రంలో ఒక ప్రీమియర్ షో టికెట్ ధర రూ.600 నిర్ణయించడంపై వ్యవసాయరంగంపై ప్రభుత్వ చిత్తశుద్ధిని బయటపెట్టేసిందని ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రైతుల శ్రమకు, కష్టానికి విలువ లేకుండా పోతున్న ఈ పరిస్థితుల్లో, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి. కేవలం సినిమా టికెట్ ధరల నియంత్రణపై మాత్రమే కాకుండా, అరటి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలన్న డిమాండ్ వ్యక్తం అవుతోంది. లేదంటే అన్నదాత ఆక్రందనలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు శాపంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.









