అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పనితీరు సీఎం చంద్రబాబును గందరగోళంలో పడేసింది. ప్రముఖ సర్వే సంస్థ ఇచ్చిన నివేదికలో ఎమ్మెల్యేల పనితీరుపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లుగా స్పష్టం చేసింది. కొంతమందికి అనవసరంగా టికెట్లు ఇచ్చామనే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు సరిగా పనిచేయడంలేదన్న నివేదిక పార్టీ అధిష్టానానికి షాకిచ్చింది.
ఇవాళ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేల ప్రవర్తనపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల తీరుతెన్నులు, వ్యవహార శైలిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ, క్రమశిక్షణ, బాధ్యతాభావం లోపిస్తున్నదని మండిపడ్డారు. సచివాలయంలో ఈరోజు మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపిన అనంతరం సీఎం సీరియస్ స్పీచ్ ఇచ్చారు.
“ఎమ్మెల్యేల బాధ్యత ఇన్‌చార్జ్ మంత్రులదే. కానీ కొందరు మంత్రులు నిర్లక్ష్యం చూపడం వల్లే ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు” అని చంద్రబాబు స్పష్టంచేశారు. తప్పు చేసిన ఎమ్మెల్యేలపై కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. మొత్తం 48 మంది ఎమ్మెల్యేల పనితీరులో మార్పు అవసరమని గుర్తుచేశారు. విశాఖపట్నంలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. నవంబర్ 13వ తేదీ నుంచి అన్ని మంత్రులు విశాఖలోనే ఉండాలని ఆదేశించారు.
ఇంతకుముందు మంత్రులతో జరిగిన బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలోనూ, ఎమ్మెల్యేల వ్యవహారంపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. “తొలిసారి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలకు మంచిచెడులు తెలియడం లేదు” అని లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో పాటు సీఎం చేసిన విమర్శలు పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవల సర్వే రిపోర్టులు, కార్యకర్తల ఫిర్యాదులు కూడా ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్రమైన వ్యతిరేకతను సూచించాయి. కొందరికి అనవసరంగా టికెట్లు ఇచ్చానని స్వయంగా చంద్రబాబు కూడా అంగీకరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో టికెట్లు ఇచ్చానని ఆయన వివరణ ఇచ్చినా, ప్రజల్లో ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేల దోపిడీ, అవినీతి వ్యవహారాలపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది.








