కేంద్రం జమిలీ ఎన్నికల విధానాన్ని అమలు చేసే దిశగా కీలక అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 16న ఈ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జమిలీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జమిలీ వచ్చినా, ఎన్నికలు 2029లోనట
చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ “ఒకే దేశం, ఒకే ఎన్నికల విధానానికి మా మద్దతు ఉందని మునుపే ప్రకటించాం. అయితే, జమిలీ అమలులోకి వచ్చినప్పటికీ, ఎన్నికలు 2029లోనే జరుగుతాయి” అని స్పష్టం చేశారు. జమిలీపై వైసీపీ వైఖరిని ఖండిస్తున్నానని చంద్రబాబు చెప్పారు.
ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రణాళికలు
రాబోయే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు కొత్త మార్పులను తీసుకురావాలని చంద్రబాబు సూచించారు. “ప్రశ్నలు-సమాధానాల రూపంలో సమీక్షలు జరుపుతాం. ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చించాల్సిన అంశాల అజెండాను పంపిస్తాం. ఈ విధానం సమయాన్ని ఆదా చేయడమే కాకుండా మంత్రులు, అధికారుల మధ్య పరస్పర చర్చలకు దోహదం చేస్తుంది” అని వివరించారు.
అద్వానీ ఆరోగ్యం గురించి ఆకాంక్ష
బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అద్వానీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఆయనతో తనకు దశాబ్దాల అనుబంధం ఉందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆయన సహకారం మరువలేనిదని గుర్తుచేశారు.