హర్యానాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేల్చిన “25 లక్షల దొంగ ఓట్లు” బాంబు దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఈసీ (ECI) సహకారంతో బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడి, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసిందని రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. హర్యానాలో ప్రతి ఎనిమిది ఓట్లలో ఒకటి నకిలీ ఓటు అని రాహుల్ బాంబు పేల్చడంతో రాజకీయ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఆ విషయాన్ని ఆధారంగా చేసుకుని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇది ఓట్ల దొంగతనమే కాదు, సర్కార్ చోరీ!” అంటూ ఆమె ఫైర్ అయ్యారు. “మోడీ మోసం మీద, ఎన్నికల సంఘం దగా మీద రాహుల్ పేల్చిన హైడ్రోజన్ బాంబు ఇది” అంటూ షర్మిలా మండిపడ్డారు. బీజేపీ అవసరమైన చోట దొంగ ఓట్లు చేర్చి, అవసరం లేని చోట ఓట్లు తొలగించి ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తోందని ఆమె ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్‌లో “ఓట్ చోర్ – గద్దీ చోర్” క్యాంపెయిన్‌కి విశేష స్పందన లభించిందని, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని, మొత్తం 17.65 లక్షల సంతకాలు సేకరించినట్టు షర్మిలా వెల్లడించారు. “ఈ సంతకాలను ఢిల్లీకి పంపిస్తున్నాం. ప్రజలు మోడీ ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడిందని నమ్ముతున్నారు” అని ఆమె తెలిపారు.
“ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుంది. రాజ్యాంగాన్ని, ఓటు విలువను కాపాడటం మా బాధ్యత” అని వైఎస్ షర్మిలా స్పష్టం చేశారు. “ఈసీ ప్రజల పక్షాన ఉండాల్సింది.. కానీ బీజేపీ పక్షాన నిలిచింది. దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.








