నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటారు. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ ప్రమోషన్లలో భాగంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికకు జోడీగా దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో విడుదల కానుంది.
సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా సింగర్ చిన్మయితో జరిగిన ఓ ఇంటర్వ్యూలో రష్మిక, చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్మయి ఒక ‘రాపిడ్ ఫైర్’ ప్రశ్న వేశారు. “బ్రేకప్ అయితే అబ్బాయిలే ఎక్కువ బాధపడతారు.. అమ్మాయిలు చాలా సింపుల్‌గా మూవ్ ఆన్ అయిపోతారు, ఇది నిజమేనా?” అని రష్మికను అడిగారు.
దానికి రష్మిక కూడా ఆసక్తికరంగా బదులిచ్చింది. “అలా ఎవరు చెప్పారు అసలు? మనం (అమ్మాయిలం) అంటే గడ్డాలు, మీసాలు పెంచుకోలేం. మందు తాగితే ఇంట్లో వాళ్లు ఊరుకోరు. అందుకే మన బ్రేకప్ బాధ ఎవరికీ కనిపించదు. కానీ అమ్మాయిలు అంత ఈజీగా మూవ్ ఆన్ అయిపోరు. బ్రేకప్ అయితే అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఆ బాధ ఎక్కువగా ఉంటుంది” అని రష్మిక చెప్పుకొచ్చింది.
రష్మిక ఇచ్చిన ఈ సమాధానంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే, రష్మిక గతంలో నటుడు రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం తర్వాత బ్రేకప్ చేసుకుంది. దీంతో అభిమానులు “అయితే రక్షిత్‌తో బ్రేకప్ అయినప్పుడు రష్మికనే ఎక్కువ బాధపడిందా?” అని ప్రశ్నిస్తూ కామెంట్లు పెడుతున్నారు.







