హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ (Fake Birth Certificates)తో కొందరు ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను HCAలోని కొందరు అధికారులు తొక్కేస్తున్నారంటూ ఏకంగా రాచకొండ (Rachakonda) పోలీస్ కమిషనర్ (Police Commissioner)కు ఫిర్యాదు అందడం రాష్ట్ర క్రీడా వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా, అనంత్ రెడ్డి (Ananth Reddy) అనే వ్యక్తి HCAతో పాటు పలువురు ఆటగాళ్లపై రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. అండర్ 16, అండర్ 19, అండర్ 23 లీగ్ మ్యాచ్‌లలో పలువురు ఆటగాళ్లు నకిలీ పత్రాలతో ఆడుతున్న బాగోతం నడిచిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయా విభాగాల్లో స్థానం పొందేందుకు కొందరు ఆటగాళ్లు నకిలీ బర్త్ సర్టిఫికెట్లు సమర్పించారని తెలిపారు. HCA నిర్లక్ష్యం కారణంగా ఎక్కువ వయసు ఉన్న ఆటగాళ్లు తక్కువ వయసు లీగ్‌లలో ప్రవేశిస్తున్నారని అనంత్‌రెడ్డి ఆరోపించారు.
గతంలో కూడా ఆరుగురు ఆటగాళ్లను గుర్తించి బీసీసీఐ బ్యాన్ విధించిన విషయాన్ని అనంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎక్కువ వయసు ఉన్నప్పటికీ, తక్కువ ఏజ్ లీగ్‌లో ఆడేందుకు HCA అవకాశమిస్తోందని ఆయన ఆరోపించారు. గతంలో ఫేక్ సర్టిఫికెట్లుగా పోలీసులు తేల్చినవాళ్లు కూడా ఈ ఏడాది ఎలా తిరిగి రీఎంట్రీ ఇచ్చారని ప్రశ్నించారు. టాలెంట్ ఉన్న ప్లేయర్లకు నష్టం కలిగేలా HCA వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. అవినీతికి పాల్పడి, టాలెంట్ లేని ప్లేయర్లను వివిధ లీగ్ మ్యాచ్‌లలో ఆడిస్తున్న HCA అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అనంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన విచారణ కోసం ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆయన, HCAలో ఫేక్ మరియు డబుల్ బర్త్ సర్టిఫికెట్లను అరికట్టాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే పలు అంశాల్లో HCA అవినీతి తీవ్ర విమర్శలకు దారి తీసిన నేపథ్యంలో, ఇప్పుడు మళ్లీ ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ ఆరోపణలతో HCA మరో పెద్ద వివాదంలో చిక్కుకుంది.








