దసరా పండుగ మాంసాహార ప్రియులకు భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా తెలంగాణలో పండగ అంటే ముక్క ఉండాల్సిందే. దసరా తెలంగాణ వాసులకు అతిపెద్ద పండగ. కుటుంబంతో విందు భోజనాలు, దోసులతో కలిసి దావత్‌లు జరుపుకొని చిన్ననాటి క్షణాలను గుర్తుచేసుకునే అద్బుతమైన క్షణం. అలాంటి దసరా పండుగకు మాంసాహార ప్రియులకు ముక్క కరువవుతోంది. ఎందుకంటే ఈసారి దసరా పండుగ జరుపుకునే తేదీ అంత ప్రాముఖ్యమైనది.
అక్టోబర్ 2న దసరా, గాంధీ జయంతి ఒకే రోజున రావడంతో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజు నగరంలోని అన్ని మాంసం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. GHMC అధికారులు గాంధీ జయంతి పవిత్రతను కాపాడేందుకు ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించారు. ఆదేశాలను ఉల్లంఘించే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణ చేపట్టి మాంసం విక్రయం జరుగకుండా చూస్తారని కూడా తెలిపారు.
విశాఖలోనూ అదే పరిస్థితి..
ఇక విశాఖపట్నంలోనూ ఇదే పరిస్థితి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) కూడా అక్టోబర్ 2న అన్ని మాంసం దుకాణాలు మూసివేయాలని అధికారికంగా ప్రకటించింది. దీంతో దసరా రోజున మాంసం అందుబాటులో ఉండదన్న విషయం మాంసాహార ప్రియుల్లో అసంతృప్తిని కలిగిస్తోంది.








