బాలీవుడ్ (Bollywood) నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut)పై తమిళనాడు (Tamil Nadu) కాంగ్రెస్ మాజీ చీఫ్, సీనియర్ నేత కేఎస్. అళగిరి (K.S.Alagiri) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కంగనా దక్షిణాది రాష్ట్రాలకు వస్తే రైతులు ఆమెను చెంపదెబ్బ కొట్టాలని ఆయన పిలుపునివ్వడంపై రాజకీయంగా దుమారం చెలరేగింది.
తాజాగా, ఈ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh) పర్యటనలో ఉన్నప్పుడు స్పందించారు. తాను దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చని, తిరగవచ్చని, ఎవరూ ఎవరినీ ఆపలేరని అన్నారు. రాజకీయాలు, సినిమాల్లో ద్వేషించే వారితో పాటు ప్రేమించేవారు కూడా ఉంటారని, అయితే తనకు ప్రేమించేవారే ఎక్కువగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. గతంలో తను నటించిన ‘తలైవి’ సినిమాలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్ర పోషించినప్పుడు తమిళనాడులో మంచి స్పందన వచ్చిందని గుర్తుచేసుకున్నారు. తమిళనాడుకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు కూడా తనను ‘తలైవి’ అని పిలుస్తారని చెప్పారు. అందుకే, ఎవరో ఏదో మాట్లాడినంత మాత్రాన తనకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.
అయితే, అళగిరి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. పది నుంచి పదిహేను మంది రైతులు తనను కలిసినప్పుడు, 2020లో రైతుల గురించి కంగనా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారని చెప్పారు. ఆ సమయంలోనే తాను, ఆమె దక్షిణాదికి వస్తే మీరు కూడా చెంపదెబ్బ కొట్టాలని రైతులకు చెప్పినట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగినప్పుడు, కంగనా నిరసనలో పాల్గొన్న మహిళల గురించి సోషల్ మీడియాలో తప్పుడు వ్యాఖ్యలు చేశారని, రూ. 100 ఇచ్చి వృద్ధ మహిళలను నిరసనల్లో కూర్చోబెట్టుకుంటున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యల తర్వాత, చండీగఢ్ విమానాశ్రయంలో ఒక సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కంగనాను చెంపదెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని అళగిరి ప్రస్తావిస్తూ రైతులకు ఈ పిలుపునిచ్చారు.







