తాను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను హైజాక్ చేయాలనే ప్రయత్నం జరుగుతుందని, అలా చేస్తే సహించబోనని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కెలికితే అపరిచితుడు బయటకు వస్తాడని హెచ్చరించారు. భీమవరంలో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ (Bhoopathi Raju Srinivasa Varma) చేసిన వ్యాఖ్యలు కూటమి పార్టీల మధ్య తీవ్ర చర్చకు దారితీశాయి.
“సంబంధం లేకుండా నా జోలికి రాకండి. నన్ను కెలికితే అపరిచితుడు (Stranger) బయటకు వస్తాడు” అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ప్రజలతో మమేకమై పనిచేస్తూ, పార్లమెంట్ టికెట్ తెచ్చుకొని 2 లక్షల 80 వేల రికార్డు మెజార్టీతో గెలిచి, కేంద్ర మంత్రిగా ఎదిగానని గుర్తుచేశారు.
ఎవరో చేసిన అభివృద్ధిని తన ఖాతాలో వేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. “నేను చేసే అభివృద్ధి కార్యక్రమాలను వేరే ఎవరు వాడుకోవద్దు. అలాంటి పరిస్థితి వస్తే, ఎక్కడ సమాధానం చెప్పాలో అక్కడే చెబుతాను” అని భూపతిరాజు స్పష్టం చేశారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కూటమి నేతలను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారని పలువురు చర్చించుకుంటున్నారు.