విజయవాడ (Vijayawada) న్యూ రాజరాజేశ్వరిపేట (New Rajarajeswaripeta)లో డయేరియా (Diarrhea) కేసులు (Cases) అక్కడి స్థానికులను వణికిస్తున్నాయి. రోజురోజు కొత్త కేసులు పెరిగిపోతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. న్యూరాజరాజేశ్వరి పేటలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో చికిత్స పొందుతున్న బాధితులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి పరామర్శించారు. ఇప్పటివరకు మొత్తం 141 కేసులు నమోదు కాగా, అందులో 68 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. స్థానికులు ఇద్దరు చనిపోయారని చెబుతుండగా, మంత్రి మాత్రం అవన్నీ వదంతులని కొట్టిపారేశారు. “డయేరియాతో ఎవరూ చనిపోలేదు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది” అని స్పష్టం చేశారు.
మంత్రి సత్యకుమార్ (Satyakumar) మాట్లాడుతూ, ప్రతి ఇంటికి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మందులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మంచినీటి పైపులైన్, అండర్‌గ్రౌండ్ వాటర్ సాంపిల్స్‌ని పరీక్షల కోసం పంపించామని వివరించారు. అంతవరకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా బయట నుంచి క్యాన్లలో నీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు.
“డయేరియా కేసులు బయటపడిన వెంటనే అధికారులందరూ స్పందించి చర్యలు ప్రారంభించారు. కేసులపై పూర్తిగా పరిశీలన జరుగుతోంది. మొదటి విడత టెస్టుల్లో ఎలాంటి సమస్య రాలేదు” అని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని కూడా స్పందించారు. బాధితులకు అవసరమైన వైద్యసేవలు అందించామని చెప్పారు. “ప్రజలకు శాశ్వత పరిష్కారం కోసం భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నాం. ఎవరూ ఇబ్బంది పడకుండా శాశ్వతంగా సమస్యను పరిష్కరిస్తాం” అని ఆయన హామీ ఇచ్చారు.