కవితకు హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్

కవిత వ్యాఖ్యలపై తొలిసారి స్పందించిన హరీష్ రావు

Summarize with AI

తెలంగాణ (Telangana)లో రాజకీయాలు వేడెక్కాయి. గత కొంతకాలంగా బీఆర్‌ఎస్(BRS) అంతర్గత వ్యవహారాలు చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా, కవిత(Kavitha) పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) విషయంలో హరీష్ రావు (Harish Rao) అవినీతి (Corruption)కి పాల్పడ్డారని కవిత బహిరంగంగానే ఆరోపించారు. అంతేకాకుండా, సంతోష్ రావు (Santosh Rao) కూడా కుట్రలు పన్నుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలతో రాజకీయంగా వేడి పెరిగింది. దీనితో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్(KCR), కవితను పార్టీ నుంచి సస్పెండ్ (Suspended) చేశారు. ఆ తర్వాత కవిత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

ఈ వివాదం జరిగిన సమయంలో హరీష్ రావు లండన్(London) పర్యటనలో ఉన్నారు. విదేశీ పర్యటన ముగించుకుని ఈరోజు హైదరాబాద్ చేరుకున్న హరీష్ రావు, కవిత వ్యాఖ్యలపై తొలిసారి స్పందించారు. శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, “ఇటీవల కొన్ని రాజకీయ పార్టీల నాయకులు తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు” అని అన్నారు. కవిత కూడా ఆ ప్రచారాన్నే మరోసారి మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. “నాపై చేసిన వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను” అని హరీష్ రావు అన్నారు.

“నా జీవితం తెరిచిన పుస్తకం. తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏమిటో అందరికీ తెలుసు. క్రమశిక్షణ గల బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తగా కేసీఆర్ నాయకత్వంలో రెండున్నర దశాబ్దాలుగా పనిచేశాను. తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఎవరో అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన అవి నిజాలు కావు” అని ఆయన స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేలా కృషి చేస్తామని, ప్రజల కష్టాలను తొలగించి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగుతామని ఆయన తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment