ఏసీబీ కోర్టులో ప్రతిపక్ష వైసీపీ లోక్‌సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి ఊరట లభించింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఎంపీ మిథున్ రెడ్డికి లిక్కర్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఓటు వేసేందుకు అనుమతిస్తూ ఏసీబీ కోర్టు వైసీపీ ఎంపీకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం మిథున్ రెడ్డి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
మధ్యంతర బెయిల్ కోసం ఎంపీ మిథున్‌రెడ్డి పిటీషన్ దాఖలు చేయగా, ప్రభుత్వ తరఫు న్యాయవాది దీనిని వ్యతిరేకించారు. బెయిల్ ఇవ్వకూడదని కోర్టును అభ్యర్థించారు. అయితే, మిథున్ రెడ్డి లోక్‌సభ సభ్యుడిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనను సమర్థించిన కోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 11వ తేదీన తిరిగి సరెండర్ కావాలని షరతు విధించింది. బెయిల్ పేపర్స్ అందిన తర్వాత మిథున్ రెడ్డి ఈరోజే జైలు నుంచి విడుదల కానున్నట్లు సమాచారం.