గాజా (Gaza)ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ (Israel) వైమానిక దాడులు తీవ్రం చేసింది. ఈ దాడుల్లో మీడియా సంస్థలు (Media Organizations) లక్ష్యంగా చేసుకుంటున్నాయని అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల గాజాలోని ఒక ఆసుపత్రిపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఐదుగురు జర్నలిస్టులు (Five Journalists) మరణించడం (Death)పై భారతదేశం(India) తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది.
విదేశాంగ శాఖ (Foreign Affairs Department) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Randhir Jaiswal) ఎక్స్‌లో ఒక పోస్ట్ చేస్తూ, ఈ సంఘటన “తీవ్ర దిగ్భ్రాంతికరం, విచారకరం” అని పేర్కొన్నారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
దాడిలో మరణించినవారు
ఈ దాడిలో మరణించిన జర్నలిస్టులు రాయిటర్స్, అసోసియేటెడ్ ప్రెస్, అల్ జజీరా, మిడిల్ ఈస్ట్ ఐ వంటి ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలకు చెందినవారు. సోమవారం జరిగిన ఈ దారుణమైన దాడిలో ఐదుగురు జర్నలిస్టులతో సహా మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే ప్రాంతంలో జరిగిన మరో దాడిలో ఒక స్థానిక వార్తాపత్రికకు చెందిన ఆరవ జర్నలిస్ట్ కూడా మరణించారు.
మరణించిన తమ సహోద్యోగులకు సంతాపం తెలుపుతూ వివిధ మీడియా సంస్థలు ప్రకటనలు విడుదల చేశాయి. ఈ దాడిలో నలుగురు ఆరోగ్య కార్యకర్తలు కూడా మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ వెల్లడించారు.
ఇజ్రాయెల్ స్పందన
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ సంఘటనను “విషాదకరమైన ప్రమాదం”గా అభివర్ణించారు. ఈ ఘటనపై సైనిక అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఆయన తెలిపారు. 2023లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 200 మంది జర్నలిస్టులు గాజాలో మరణించారని మీడియా వాచ్డాగ్స్ నివేదికలను ఉటంకిస్తూ ఏఎఫ్‌పీ (AFP) వార్తా సంస్థ పేర్కొంది.