బంగ్లాదేశ్ (Bangladesh])తో జరగాల్సిన వన్డే (ODI), టీ20 (T20) సిరీస్‌లను (Series) బీసీసీఐ (BCCI) వాయిదా (Postponed) వేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ షెడ్యూల్ చాలా కఠినంగా ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ (BCCI) పేర్కొన్నప్పటికీ, బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా ఆటగాళ్ల భద్రత దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తాజాగా, ఆసియా కప్ 2025 నిర్వహణ పైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల చివరి వారంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) సమావేశం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా (Dhaka)లో జరగనుంది. ఇప్పుడు ఇదే ప్రధాన సమస్యగా మారింది. ఈ ఢాకాలో జరగబోయే ఏసీసీ మీటింగ్‌కు తాము హాజరుకావడం లేదని ఇప్పటికే భారత్ (BCCI), శ్రీలంక (Sri Lanka) దేశాలు సమాచారం ఇచ్చాయని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, షెడ్యూల్ ప్రకారం ఏసీసీ మీటింగ్ మాత్రం జరుగుతుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
“ఇంకా రెండు వారాల సమయం ఉంది. అన్ని సభ్య దేశాలు తమ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఎవరైనా ఢాకాకు రాలేకపోతే, వారు ఆన్‌లైన్ వేదికగా పాల్గొనే అవకాశం ఉంది. మీటింగ్ మాత్రం తప్పకుండా ఢాకాలోనే జరుగుతుంది. జులై 20 నుంచి 24 మధ్య బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ జరగనుంది. కాబట్టి, ఏసీసీ మీటింగ్ కూడా ఇక్కడ నిర్వహించడం సముచితం. ఇప్పటివరకు ఒక్క సమావేశం కూడా ఢాకాలో జరగలేదు” అని పాకిస్థాన్ బోర్డు ప్రతినిధి పేర్కొన్నారు.
భారత్‌వే ఆతిథ్య హక్కులు.. టోర్నీ స్థల మార్పునకు యోచిస్తున్న బీసీసీఐ?
షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్‌లో ఆసియా కప్ జరగాలి. ఈ టోర్నీ నిర్వహించే ఆతిథ్య హక్కులు భారత్‌వే. అయితే, ఈ టోర్నీని వేరే చోటుకు మార్చాలని ఏసీసీని బీసీసీఐ అడిగే అవకాశం ఉందని సమాచారం. భారత్‌లోకి పాకిస్థాన్ జట్టుకు అనుమతి ఇవ్వడం కష్టమే కావచ్చు. గత ఛాంపియన్ ట్రోఫీ నుంచి ఈ ఒప్పందం అమలవుతోంది. అప్పుడు కూడా పాకిస్థాన్ ఆతిథ్యంలో టోర్నీ జరిగినప్పటికీ, భారత్ ఆడే మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే.
మరోవైపు, అసలు టోర్నీని నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉందా అని ఏసీసీ అడిగినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. టోర్నీ నుంచి తాము వైదొలగడం లేదని ఇప్పటికే బీసీసీఐ స్పష్టత ఇచ్చింది. అయితే, పోటీలను భారత్‌లో కాకుండా యూఏఈ (UAE) వేదికగా నిర్వహించేందుకూ బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.