9వ స్థానంలో వ‌చ్చి మ్యాచ్‌ని మ‌లుపుతిప్పిన బౌల‌ర్‌

9వ స్థానంలో వ‌చ్చి మ్యాచ్‌ని మ‌లుపుతిప్పిన బౌల‌ర్‌

Summarize with AI

ఆస్ట్రేలియా (Australia) యువ పేసర్ జేవియర్ బార్ట్‌లెట్ (Xavier Bartlett) మేజర్ లీగ్ క్రికెట్‌ (Major League Cricket)లో ఒక మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఎంఐ న్యూయార్క్‌ (MI New York)తో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతను.. ఓటమి అంచుల్లో ఉన్న తన జట్టును (శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్) (San Francisco Unicorns) నమ్మశక్యంకాని ఇన్నింగ్స్‌తో (25 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విజయతీరాలకు చేర్చాడు.

ఎంఐ న్యూయార్క్ ఇన్నింగ్స్
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ న్యూయార్క్.. క్వింటన్ డికాక్ (Quinton De Kock) (38 బంతుల్లో 63; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఎంఐ ఇన్నింగ్స్‌లో మోనాంక్ పటేల్ (14 బంతుల్లో 20), కీరన్ పొలార్డ్ (16 బంతుల్లో 30), సన్నీ పటేల్ (11 బంతుల్లో 20 నాటౌట్), మైఖేల్ బ్రేస్‌వెల్ (11 బంతుల్లో 17) కూడా బ్యాట్లు ఝులిపించారు. కెప్టెన్ పూరన్ (7 బంతుల్లో 5) నిరాశపరిచాడు. యూనికార్న్స్ బౌలర్లలో హరీస్ రౌఫ్, కార్మీ లె రాక్స్, హసన్ ఖాన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేవియర్ బార్ట్‌లెట్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.

యూనికార్న్స్ విజయంలో బార్ట్‌లెట్ పాత్ర
అనంతరం బరిలోకి దిగిన యూనికార్న్స్.. నవీన్ ఉల్ హక్ (Naveen-ul-Haq) (4-0-28-2), ట్రెంట్ బౌల్ట్ (4-0-39-1) రెచ్చిపోవడంతో 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో టిమ్ సీఫర్ట్ (33), హసన్ ఖాన్ (43) యూనికార్న్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరూ కూడా జట్టు స్కోర్ 110 పరుగుల లోపే ఔట్ కావడంతో యూనికార్న్స్ మరోసారి కష్టాల్లో పడింది. ఈ దశలో యూనికార్న్స్‌ను లేవనెత్తే బాధ్యతను బార్ట్‌లెట్ తీసుకున్నాడు. బార్ట్‌లెట్ నమ్మశక్యంకాని రీతిలో షాట్లు ఆడుతూ ఓటమి కొరల్లో ఉన్న తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.

బార్ట్‌లెట్‌కు కెప్టెన్ కోరె ఆండర్సన్ (9), హరీస్ రౌఫ్ (10 నాటౌట్) సహకరించారు. వీరిద్దరూ కేవలం స్ట్రయిక్ రొటేట్ చేస్తూ బార్ట్‌లెట్‌కు అవకాశం ఇవ్వగా, మిగతా పనినంతా అతనే చూసుకున్నాడు. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో వరుసగా సిక్సర్, రెండు ఫోర్లు బాదిన బార్ట్‌లెట్ మ్యాచ్‌ను యూనికార్న్స్ వైపు మళ్లించాడు. ఆ మరుసటి ఓవర్‌లో బౌండరీ సహా 6 పరుగులు చేసిన బార్ట్‌లెట్ కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం 19వ ఓవర్‌లో 11 పరుగులు పిండుకున్న బార్ట్‌లెట్.. చివరి ఓవర్ తొలి బంతికి సిక్సర్ బాది యూనికార్న్స్‌ను విజయతీరాలకు చేర్చాడు.

ఈ మ్యాచ్‌లో యూనికార్న్స్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. బార్ట్‌లెట్ నమ్మశక్యంకాని ఇన్నింగ్స్‌తో యూనికార్న్స్‌ను గెలిపించాడు. బార్ట్‌లెట్ ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు. అయితే అతనికి బ్యాటర్‌గా పెద్ద అవకాశాలు రాలేదు.

Join WhatsApp

Join Now

Leave a Comment