బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు స‌ర్వం సిద్ధం.. ల‌క్ష‌ల్లో గులాబీ ద‌ళం

బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు స‌ర్వం సిద్ధం.. ల‌క్ష‌ల్లో గులాబీ ద‌ళం

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) రజతోత్సవ సభ ఆదివారం వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించేందుకు సర్వసిద్ధమైంది. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్‌) ఈ సభలో పాల్గొననున్నారు. సుమారు నెల రోజులుగా పార్టీ యంత్రాంగం సభ విజయవంతం కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. సభకు దాదాపు 10 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించేందుకు సిద్ధం
14 ఏళ్లు ఉద్యమ పార్టీగా, 9.5 ఏళ్లు అధికారంలో కొనసాగిన బీఆర్‌ఎస్‌.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పరాజయాల తర్వాత తొలిసారిగా ఇంత పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తోంది. దేశం మొత్తం దృష్టిని ఆకర్షించేలా సభను నిర్వహించేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్న కేసీఆర్‌ ప్రసంగంపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

కాంగ్రెస్‌పై కుండబద్దలు
తెలంగాణ చరిత్రలో కాంగ్రెస్ పార్టీనే ప్రధాన ప్రతినాయకుడిగా బీఆర్‌ఎస్ చూస్తోందని, ఈ సభలో కూడా కేసీఆర్‌ ఈ అంశాన్ని గట్టి నొక్కిచెప్పే అవకాశం ఉందని సమాచారం. కేవలం 15 నెలల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని, తెలంగాణ మళ్లీ గందరగోళానికి లోనైందని కేసీఆర్ ఇప్పటికే అనేక సందర్భాల్లో విమర్శించారు. రజతోత్సవ సభలో కూడా ఈ విమర్శలు తీవ్రతరం కావొచ్చని అంటున్నారు.

ఘనంగా ఏర్పాట్లు
ఎల్కతుర్తి, చింతలపల్లి, దామెర, కొత్తపల్లి, గోపాల్‌పూర్, బావుపేట వంటి గ్రామాల రైతుల నుంచి సేకరించిన 1,213 ఎకరాల్లో సభ ఏర్పాటు చేశారు. ఇందులో 154 ఎకరాల్లో సభాస్థలి ఉండగా, 1,059 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. వేడిని దృష్టిలో పెట్టుకొని 10.80 లక్షల వాటర్ బాటిళ్లు, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. అత్యవసర పరిస్థితుల కోసం 12 వైద్య శిబిరాలు, 20 అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. సభా వేదికపై కేసీఆర్‌తో పాటు సుమారు 500 మంది నేతలు కూర్చోనున్నారు. వాహనాల నియంత్రణ కోసం 2,500 మంది వలంటీర్లను నియమించి శిక్షణ ఇచ్చారు. భద్రత కోసం 1,100 మంది పోలీసులను మోహరించారు.

హెలికాప్ట‌ర్‌లో కేసీఆర్‌
హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేర‌నున్న‌ కేసీఆర్‌, సభాస్థలానికి సమీపంలోని ప్రత్యేక హెలిప్యాడ్‌లో దిగుతారు. సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో వేదికపైకి చేరుకుంటారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన సుమారు గంటపాటు ప్రసంగించే అవకాశముందని సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment