ఆంధ్రప్రదేశ్‌లో మరో మాజీ మంత్రిపై కేసు నమోదైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిపై వరుసగా కేసులు నమోదవుతుండగా, తాజాగా వైసీసీ మహిళా నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. 2020లో శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి రూ.2 కోట్ల 20 లక్షలు వసూలు చేశారన్న అభియోగంతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విడదల రజనిని ఏ1గా చేర్చారు. ఆమెతో పాటు ఐపీఎస్ అధికారి జాషువాను కూడా ఈ కేసులో రెండో నిందితుడిగా పేర్కొంది. అదేవిధంగా, విడదల రజిని మరిది గోపి, వ్యక్తిగత సహాయకుడు దొడ్డ రామకృష్ణలపై కూడా నిందితులుగా చేర్చారు.
రజిని రియాక్షన్..
బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలతో తనపై నమోదైన కేసుపై మాజీ మంత్రి విడదల రజిని స్పందించారు. కూటమి ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని, ఆధారాలు లేకుండా కేసులు పెడుతోందని ఆమె మండిపడ్డారు. బీసీ మహిళ రాజకీయంగా ఎదగడాన్ని కూటమి నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు. రాజకీయ కుట్రలతో తనపై నమోదైన కేసుపై న్యాయపోరాటం చేస్తానని, కూటమి కక్షసాధింపులకు భయపడే ప్రసక్తే లేదని తీవ్రంగా స్పందించారు.
వైసీపీ కీలక నేతలపై కేసులు
వైసీపీలో కీలకంగా ఉన్న నేతలపై గత పది నెలలుగా వరుసగా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. పేర్ని నాని, మేరుగు నాగార్జున, సజ్జల రామకృష్ణారెడ్డి, వల్లభనేని వంశీ, లేళ్ల అప్పిరెడ్డి, గౌతమ్‌రెడ్డి, తలశిల రఘురాం, పోసాని కృష్ణమురళి, నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వంటి నేతలపై కేసు నమోదు కాగా, తాజాగా మాజీ మంత్రి విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.