ఏపీలో ‘పెట్రోల్’ ర‌చ్చ‌.. లెక్క‌ల‌తో స‌హా వైసీపీ టార్గెట్

ఏపీలో 'పెట్రోల్' ర‌చ్చ‌.. లెక్క‌ల‌తో స‌హా టార్గెట్ చేసిన వైసీపీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్రోల్ ధ‌ర‌ల‌పై చ‌ర్చ మొద‌లైంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గిస్తామ‌ని టీడీపీ మాటిచ్చింది. అధికారంలోకి వ‌చ్చి ప‌ది మాసాలు కావొస్తున్నా.. వాటి ఊసే ఎత్త‌క‌పోవ‌డంపై ప్ర‌తిప‌క్ష వైసీపీ నిల‌దీస్తోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు, నారా లోకేశ్ పెట్రోల్ ధ‌ర‌ల‌ను అధికారంలోకి వ‌చ్చిన‌ వెంట‌నే త‌గ్గిస్తామ‌ని ఇచ్చిన మాట నేటికీ అమ‌లు చేయ‌క‌పోవ‌డంతో అటు వాహ‌న‌దారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దేశంలోనే అగ్ర‌స్థానంలో ఏపీ..
పెట్రోల్ ధ‌ర‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం యావ‌త్ దేశంలోనే అగ్ర‌స్థానంలో ఉంది. ప్ర‌స్తుతం ఏపీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.109.60 ఉండ‌గా, డీజిల్ 97.23గా ఉంది. దేశంలో అత్య‌ధికంగా ధ‌ర‌లు వ‌సూలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. పొరుగునున్న తెలంగాణ కంటే ఏపీ రూ.2 వాహ‌న‌దారుల నుంచి వ‌సూలు చేస్తోంది. ద‌క్షిణాదిలో బీజేపీయేత‌ర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలైన త‌మిళ‌నాడు, కేర‌ళ‌లోనూ, క‌ర్ణాట‌క రాష్ట్రం కంటే ఎన్డీయూ కూట‌మి అధికారంలో ఉన్న ఏపీలోనే పెట్రోల్ ధ‌ర అధికంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

యువ‌గ‌ళంలో జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు
యువ‌గ‌ళం పాద‌యాత్ర సమ‌యంలో ‘కర్ణాటక సరిహద్దు ప్రాంతం ఆదోనిలో లీటర్ పెట్రోల్ రూ.13 ఖరీదైనది, డీజిల్ రూ.10 ఎక్కువ. సామాన్యుడి నుంచి ఈ డబ్బును పిండుకుంటూ ఏం చేస్తారు’ అంటూ నారా లోకేశ్ అప్ప‌టి సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించారు. తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే పెట్రోల్ ధ‌ర‌లు త‌గ్గిస్తామ‌ని త‌ద్వారా నిత్యావ‌స‌ర స‌రుకుల రేట్లు కూడా త‌గ్గుతాయ‌ని నారా లోకేశ్ చెప్పారు. ఏపీలో పెట్రోల్ రేట్ల‌కు భ‌య‌ప‌డి రాష్ట్రానికి వ‌చ్చేవారంతా ప‌క్క‌రాష్ట్రాల్లోనే ఫుల్ ట్యాంక్ చేయించుకొని వ‌స్తున్నార‌ని చంద్ర‌బాబు కాస్త వ్యంగ్యంగా మాట్లాడి.. తాము ఆ ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తామ‌ని చెప్పారు.

లెక్క‌ల‌తో స‌హా..
అధికారంలోకి వ‌చ్చి ప‌ది నెల‌లు గ‌డుస్తున్నా.. చంద్ర‌బాబు, లోకేశ్ పెట్రోల్ ధ‌ర ఊసెత్తుకోలేదు. పెరిగిన‌ ధ‌ర‌ల‌తో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. పెట్రోల్‌పై ప‌న్ను విధిస్తున్న కూట‌మి ప్ర‌భుత్వాన్ని ప్ర‌తిప‌క్ష వైసీపీ నిల‌దీస్తోంది. ఒక్క పెట్రోల్ మాత్ర‌మే కాదు నిత్యావ‌స‌రాల‌ రేట్లు కూడా బాదుడే బాదుడు అంటూ మండిప‌డుతోంది. గత 10 నెలలుగా దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నా చంద్ర‌బాబు, లోకేశ్ గప్ చుప్‌గా ఉన్నార‌ని, 10 నెలలుగా ధరలు తగ్గించడం చేతకావడంలేదా చంద్రబాబు..? మరి ఎందుకు ఈ అనుభవం.. అట్లకాడ మాటలు? అంటూ సెటైర్లు వేస్తోంది. దేశంలో అత్య‌ధికంగా ఏపీలోనే పెట్రోల్ రేట్లు అని లెక్క‌ల‌ను సైతం చూపిస్తూ టీడీపీని ఇర‌కాటంలో ప‌డేసింది. పెట్రోల్ ధ‌ర‌ల‌తో కూట‌మిని నిల‌దీస్తూ ట్విట్ట‌ర్‌లో నెటిజ‌న్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. మ‌రి దీనిపై కూట‌మి ప్ర‌భుత్వం ఏ విధంగా స్పందించ‌గ‌ల‌దో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment