ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నట్లు ఆ పార్టీ ఆరోపణలు చేస్తోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కార్యకర్తల కిడ్నాప్ కలకలం రేపింది.
పోలీసు యూనిఫామ్‌లో దుండగుల అరాచకం
ఆదివారం అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోలీసు యూనిఫామ్‌లో వచ్చి వైసీపీ కార్యకర్తలు కూర్మపు ధర్మారావు, అంపోలు శ్రీనివాస్‌ను బలవంతంగా తీసుకెళ్లారని, ఈ ఘటనపై కుటుంబ సభ్యులు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మాజీ మంత్రి ఆందోళన
కిడ్నాప్ విషయమై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించారు. బాధితుల కుటుంబాలను కలిశారు. వారితో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. పోలీసుల తీరుపై తీవ్ర అప్పలరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. “పోలీసుల పేరుతో వైసీపీ కార్యకర్తలను ఎవరు తీసుకెళ్లారు? వెంటనే వారిని తీసుకురావాలి” అని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం జరగడంతో, స్టేషన్ ఎదుటే ఆయన కూర్చుని నిరసనను కొనసాగించారు.
రాజకీయ పరిణామాలు
ఈ ఘటనతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. వైసీపీ ఈ ఘటనను కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తుండగా, అధికార పార్టీ తరఫున ఎలాంటి ప్రకటన వెలువడలేదు. బాధితులు ఎక్కడ ఉన్నారన్నదానిపై విచారణ ప్రారంభమైందని తెలుస్తోంది.