కూటమి ప్రభుత్వంపై వైసీపీ తీవ్ర స్థాయిలో ఫైర్

కూటమి ప్రభుత్వంపై వైసీపీ తీవ్ర స్థాయిలో ఫైర్

కూటమి ప్రభుత్వం (Alliance Government) ప్రజలను మోసం చేస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు(YSRCP Leaders) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం జరిగిన వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana), కురుసాల కన్నబాబు (Kurasala Kannababu) తదితరులు పాల్గొన్నారు. అధికార పక్షం ప్రజలను మోసం చేస్తోందని, ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు.

బొత్స సత్యనారాయణ విమర్శలు: లోకేష్ (Lokesh) అబద్ధాలు.. నిరుద్యోగ భృతి ఏది?
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, “ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం ఉంటాయి. ప్రజల సమస్యలపై గొంతుకగా నిలవడం, ఇచ్చిన హామీలపై నిలదీయడం ప్రతిపక్షం బాధ్యత. అయితే, హామీలు అమలు చేయలేదని అడిగితే కేసులు పెట్టడం, ‘నలకమందం’ అనడం సరైన సంప్రదాయం కాదు” అని అన్నారు.

చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇద్దరూ ఇచ్చిన హామీలు (Promises) ఎప్పుడు అమలు చేస్తారని బొత్స ప్రశ్నించారు. “40 శాతం ఓట్లు ఉన్న మాకు ప్రజల తరపున అడిగే హక్కు ఉంది. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామీణ స్థాయిలో ఈ మోసాలపై నిలదీస్తాం” అని స్పష్టం చేశారు.

నిరుద్యోగ భృతి: “ఈ ఏడాది పాలనలో ఉద్యోగాలు తీసి.. నిరుద్యోగ భృతి మాట లేకుండా చేశారు. ఈ ఏడాది నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి రూ.36 వేలు ఎప్పుడు ఇస్తారు?” అని బొత్స నిలదీశారు. తమ ప్రభుత్వంలో మేనిఫెస్టోను జేబులో పెట్టుకుని తిరిగితే, కూటమి నాయకులు అమలు చేయలేక తమ మేనిఫెస్టోను బీరువాలో పెట్టారని దుయ్యబట్టారు.

లోకేష్‌పై విమర్శలు: “పువ్వు పుట్టగానే పరిమళించినట్లు లోకేష్ మంత్రి అయ్యారు. తండ్రికి మించిన అబద్ధాలు లోకేష్ మాట్లాడుతున్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్లు ఉంది. ఏడాది పూర్తయినా కేంద్రం ఇచ్చిన సాయం తప్ప రాష్ట్ర హామీ ఏమైంది? సభ సాక్షిగా మే నెలలో ఇస్తామని చెప్పిన లోకేష్ ఏ మే నెలలో ఇస్తారో చెప్పాలి” అని బొత్స ప్రశ్నించారు.

ప్రభుత్వ తీరుపై ఆగ్రహం: వైద్య విద్యార్థులపై, అందులో ఆడపిల్లలు, చిన్నపిల్లలు అని చూడకుండా లాఠీఛార్జ్ చేయడం ప్రభుత్వ ధర్మం కాదని బొత్స అన్నారు. “ఏమి చేసినా అడిగే వారే లేరని వ్యవహరించడం సరికాదు. మనిషికి ఉన్న ఆశపైనే మోసపూరిత రాజకీయాలు చంద్రబాబు చేస్తారు” అని ఆరోపించారు.

రైతులు, మహిళలకు మోసం: “చంద్రబాబు ఎప్పుడూ రైతులు, మహిళలనే మోసం చేసి ముఖ్యమంత్రి అవుతున్నారు. రాష్ట్రంలో రైతులకు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. సరైన గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత ప్రభుత్వనిదే. వాటిపై మాట్లాడితే కేసులు పెట్టి తాట తీస్తామని వ్యాఖ్యలు చేస్తారా? ఉపాధి హామీలో ఎప్పుడైనా మూడు నెలల బకాయిలు చెల్లించకుండా ఉంచారా? రెక్క ఆడితే కానీ డొక్కా ఆడని వారిని ఇబ్బందులకు గురి చేస్తారా? మంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?” అంటూ బొత్స నిలదీశారు.

కన్నబాబు: “ఓటేసిన వారిని కాటేసిన ఘనత చంద్రబాబుదే”
మాజీ మంత్రి కురుసాల కన్నబాబు మాట్లాడుతూ, “మోసపోయింది ప్రజలు తప్ప.. చంద్రబాబు కాదు. ఓటేసిన వాడిని కాటేసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబే” అని ఘాటుగా విమర్శించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పథకాలను, పక్క రాష్ట్రాల్లోని కొన్ని పథకాలను కాపీ కొట్టి కూటమి ప్రభుత్వం నయవంచన చేసిందని ఆరోపించారు.

పింఛన్ హామీ: “50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చేతులెత్తేసిన ఘనత చంద్రబాబుది. ఎన్నికల సమయంలో హామీలు అమలు చేస్తామని బాండ్లపై సంతకాలు చేసిన హామీ ఏమైంది? ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యపరచాలి” అని కన్నబాబు సూచించారు.

సంక్షేమ పథకాలు: ఏడాది పాలనలో ఏవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేయలేదో ప్రజలకు వివరించాలని, సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పిన చంద్రబాబును ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని కన్నబాబు విమర్శించారు. “ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి గెలిచిన నాయకుల్లో చంద్రబాబు గిన్నిస్ రికార్డులు సాధిస్తారు” అని ఎద్దేవా చేశారు.

బాబు ష్యూరిటీ, తల్లి వందనం: ఎన్నికల మేనిఫెస్టోలో ‘బాబు ష్యూరిటీ’ అని చంద్రబాబు ప్రమాణం చేశారని, కానీ తల్లి వందనం కార్యక్రమంలో సర్పంచ్‌లను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి పథకం రాకుండా చేశారని కన్నబాబు ఆరోపించారు. రాష్ట్రంలో లక్షలాది మహిళలకు ‘తల్లికి వందనం’ రాలేదన్నది నిజమని అన్నారు.

అబద్ధపు హామీలు: “చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాలు ఆడి అధికారం దక్కించుకున్నారు. గతంలో కూడా చంద్రబాబు 89 వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి వస్తే 15 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారు. మీరు కనబడితే తొలి అడుగు కాదు, తొలిసారిగా మిమ్మల్ని నిలదీస్తారు ప్రజలు. మా ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమాన్ని నేరుగా ఇంటికి వెళ్లి తెలియజేశాం. మీరు చేసిన ప్రతి అరాచకాన్ని 2.0లో ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుంటారు” అని కన్నబాబు హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment