బాబు ఆల‌యాల‌ను కూల్చింది మ‌ర్చిపోదామా..? బీజేపీ నేత‌ల‌కు పేర్ని నాని సెటైర్లు

బాబు ఆల‌యాల‌ను కూల్చింది మ‌ర్చిపోదామా..? బీజేపీ నేత‌ల‌కు పేర్ని నాని సెటైర్లు

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌, ఎంపీ పురందేశ్వరి చంద్రబాబు ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి పెర్ని నాని మండిపడ్డారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన, వైసీపీపై హిందూ వ్యతిరేక ముద్ర వేసేలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆలయాలపై దాడులు, భూముల దోపిడీలు ఎక్కువగా బీజేపీ-టీడీపీ కలిసున్నప్పుడు జరిగాయని గుర్తుచేశారు. విజ‌య‌వాడ‌లో 40కి పైగా ఆల‌యాల‌ను చంద్ర‌బాబు కూల్చేసిన‌ప్పుడు మాధ‌వ్‌, పురందేశ్వ‌రి ఎక్క‌డున్నారు.. ఏ పార్టీలో ఉన్నారు..? అని ప్ర‌శ్నించారు పేర్ని నాని.

రామ‌తీర్థంలో ర‌ఘురాముడి విగ్ర‌హం త‌లను ధ్వంసం చేసింది తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్తే అన్న విష‌యం వారికి తెలియ‌దా? విగ్ర‌హం త‌ల‌ను ధ్వంసం చేసిన నిందితుడైన తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌ను అరెస్ట్ చేసి శిక్షించ‌కుండా సీఎంఆర్ఎఫ్ కింద రూ.5 ల‌క్ష‌ల ప‌రిహారం ఇచ్చి ఆదుకున్నారని పేర్ని నాని గుర్తుచేశారు. మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌పతిరాజుతో తీసుకున్న ఫొటోను కూడా మాధ‌వ్‌, పురందేశ్వరి పోస్ట్ చేస్తే బాగుండేదని ఎద్దేవా చేశారు. అప్పట్లో సీఎం వైఎస్ జగన్ కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించి ఆలయాలను అభివృద్ధి చేయించారని చెప్పారు. అలాగే తిరుపతిలో వకుళామాత ఆలయ పునర్నిర్మాణం, అంతర్వేది రథాన్ని తిరిగి నిర్మించి స్వయంగా అందజేయడం వైయస్ఆర్‌సీపీ హయాంలోనే జరిగిందని వివరించారు.

అంత‌ర్వేదిలో నార‌సింహుడి ర‌థాన్ని దుండ‌గులు త‌గ‌ల‌బెడితే వెంట‌నే కొత్త ర‌థాన్ని త‌యారు చేయించడంతో పాటు తానే స్వ‌యంగా వ‌చ్చి గుడికి అందచేసిన ఘ‌న‌త కూడా నాటి సీఎం జ‌గ‌న్‌కే ద‌క్కుతుందన్నారు. దాంతో పాటు ఈ ర‌థం త‌గ‌ల‌బెట్టిన అంశంపై సీబీఐతో విచార‌ణ జ‌రిపించ‌మ‌ని నాడే కేంద్రానికి లేఖ రాయ‌డం జ‌రిగిందని గుర్తుచేశారు. టీడీపీ నేతలు ఆలయ భూములపై కన్నేసి కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. గొల్లపూడి పంచాయతీలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన 40 ఎకరాల భూమిని కూటమి నేతలు బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

భూముల దోపిడీ, ఆలయాల కూల్చివేత వంటి దారుణాలపై బీజేపీ నేతలు నోరెత్తకపోగా, వాస్తవాలను వక్రీకరించి వైయస్ఆర్‌సీపీపై బురద జల్లడమే వారి లక్ష్యమని నాని విమర్శించారు. దేవుడి ఆస్తులను కాపాడటం కోసం వైయస్ఆర్‌సీపీ కోర్టులను ఆశ్రయిస్తుందని, కూటమి నేతల దోపిడీని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment