వైసీపీ నేత, ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన హత్యాయత్నం కేసును కొట్టివేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గౌతమ్‌రెడ్డి అభ్యర్థనను స్వీకరించిన గౌరవ న్యాయస్థానం.. కీలక ఉత్తర్వులు వెల్లడించింది. అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణ జరిగే వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఈ కేసులో వారం రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులిచ్చింది.
భూ వివాదంలో ఉమామహేశ్వర శాస్త్రిని హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్‌ను రంగంలో దించారని ఆరోపణలతో సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో గౌతమ్‌రెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది. కూటమి ప్రభుత్వంపై తనపై అక్రమంగా కేసు నమోదు చేసిందని, బెయిల్ ఇవ్వాలని గౌతమ్‌రెడ్డి హైకోర్టును కోరగా, ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది.
సుప్రీంకోర్టులో గౌతమ్ రెడ్డి తరఫున న్యాయవాదులు సిద్ధార్థ దవే, అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు. గౌతమ్ రెడ్డిపై కూటమి అక్రమంగా కేసు బనాయించిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ప్రభుత్వం కేవియట్ ఎలా దాఖలు చేస్తుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఫిర్యాదుదారుడు కాకుండా ప్రభుత్వమే ఎందుకు యాక్టివ్‌గా ఉందని కోర్టు ప్రశ్నల వర్షం కురిపిస్తూ వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.