ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల పెంపుపై నిరసనలు వెల్లువెత్తాయి. సామాన్యుడికి గుదిబండగా మారిన విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పోరుబాటలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం వెంటనే కరెంట్ చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల వారీగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది ప్రతిపక్ష వైసీపీ. భారీ ర్యాలు నిర్వహించి విద్యుత్ కార్యాలయాల వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
హామీల మోసం.. ప్రజలపై భారం
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు విద్యుత్ చార్జీలు అసలు పెంచబోమని, అధికంగా ఉన్న చార్జీలను అధికారంలోకి రాగానే తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కానీ, సుమారు ఆరు నెలల వ్యవధిలోనే ఆయన ప్రభుత్వానికి విద్యుత్ చార్జీల పెంపుపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. వైసీపీ నేతలు, ఈ పెంపును మోసం, ప్రజలకు మోయలేని భారంగా అభివర్ణించారు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ చార్జీల పెంపుపై నిరసనలో పాల్గొన్న వైసీపీ శ్రేణులు.. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పరిపాలన చేయాలని, అధికారం ఇచ్చిన ప్రజల నెత్తిన విద్యుత్ బిల్లుల భారం మోపడం హేయమని కూటమి ప్రభుత్వానికి చురకలు అంటిస్తున్నారు. చంద్రబాబుకు ప్రజల సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. వెంటనే విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కరెంటు చార్జీలు తగ్గించకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని వైసీపీ నేతలు హెచ్చరించారు.
కాకినాడ, తిరుపతి, విశాఖ, నెల్లూరు వంటి ప్రాంతాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి, విద్యుత్ బిల్లుల పెంపును నిరసించారు. విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద వినతిపత్రాలు అందజేయడముతో పాటు, అధికారుల ఎదుట నిరసనలు వ్యక్తం చేశారు.