వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు సభకు హాజరైన వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శాసనసభలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో గవర్నర్ ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేశారు. సభ నుంచి వైసీపీ సభ్యులు బయటకు వచ్చారు. అనంతరం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
కూటమిపై వ్యతిరేకత తీవ్రమైంది..
శాసన మండలి సమావేశాలకు హాజరుకావాలని ఎమ్మెల్సీలను జగన్ ఆదేశించారు. ప్రజాసమస్యలపై మండలిలో బలంగా ప్రస్తావించాలని సూచించారు. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో రాజీలేని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని, టీడీపీ ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలిపోయాయన్నారు.
ప్రజా సమస్యల విషయంలో రాజీపడొద్దు..
కూటమి ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదని, మరో 30 ఏళ్లు తాను రాజకీయాలు చేస్తానని, ప్రతిపక్షంలో మన సమర్థతను నిరూపించుకోవడానికి ఇదొక అవకాశమని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు జగన్. పార్టీ కోసం, ప్రజల కోసం గట్టిగా పని చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. జమిలి ఎన్నికలంటున్నారు.. అదే జరిగితే ఎలక్షన్స్ మరింత ముందుగా వస్తాయని, అందుకే ప్రజా సమస్యల విషయంలో ఎక్కడా రాజీపడకుండా పోరాటం చేయాలని, తప్పకుండా విజయం సాధిస్తామన్నారు.
కక్ష కట్టి రద్దు చేస్తే కోర్టుకు వెళ్తాం..
అసెంబ్లీలో వైసీపీ తప్ప వేరే ప్రతిపక్షం లేదని, ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే ఇవాళ అసెంబ్లీకి వెళ్లామని చెప్పారు. ప్రతిపక్ష హోదా ఇస్తే హక్కుగా వైసీపీకి సమయం ఇవ్వాల్సి వస్తుందని, నెపంతోనే హోదాను ఇవ్వడం లేదన్నారు. తాను ఏ అంశంపై మాట్లాడినా నిందలకు, దూషణలకు దూరంగా ఉంటానని, ప్రతి అంశంలో ఆధారాలు, రుజువులతో మాట్లాడతానని వైఎస్ జగన్ చెప్పారు. సభలో ప్రభుత్వం స్వరం తప్ప వేరే స్వరం వినపడకూడదు అన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అన్యాయంగా ఇళ్ల పట్టాలు రద్దు చేస్తోందన్న అంశంపై వైఎస్ జగన్ స్పందించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన 31 లక్షల ఇళ్ల పట్టాలను కక్ష కట్టి రద్దు చేస్తే తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.