చంద్రబాబు (Chandrababu) నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం (Government)పై వైసీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) తీవ్ర విమర్శలు గుప్పించారు. తాడేపల్లి (Tadepalli)లోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ “ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజల తరఫున మా పోరాటం ఆగదు. చంద్రబాబూ, నీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నా, వడ్డీతో సహా లెక్క చెల్లిస్తాం” అని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ ఛార్జీల రూపంలో రూ.18 వేల కోట్ల భారం మోపిందని, అడిగితే తప్పుడు కేసులతో అణచివేస్తోందని ఆయన ఆరోపించారు.
కరేడు రైతులను (Kareda Farmers) ఖాళీ చేయించాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. చేవూరు, రావూరు ప్రాంతాల్లో ఇండోసోల్ కంపెనీకి భూములు ఇచ్చి రైతులకు అన్యాయం చేస్తున్నారని, కృష్ణపట్నం పోర్టు (Krishnapatnam Port)లో 10 వేల ఎకరాల భూమి రామోజీరావు (Ramoji Rao) బంధువుల వద్ద ఉంటే, అక్కడ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదని జగన్ నిలదీశారు.
ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని, పరిశ్రమలపై బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌తో వసూళ్లు చేస్తోందని జగన్ ఆరోపించారు. సిద్ధార్థ్ కౌశల్ వంటి ఐపీఎస్ అధికారులు వేధింపుల కారణంగా రాజీనామాలు చేస్తున్నారని, 8 మంది డీఎస్పీలను సస్పెండ్ చేసి, 80 మంది ఇన్‌స్పెక్టర్లు, వందలాది కానిస్టేబుళ్లను పోస్టింగ్‌లు లేకుండా వదిలేశారని ఆయన విమర్శించారు. “డీఐజీల ద్వారా వసూళ్లు చేసి, పెద్దబాబులకు, చిన్నబాబులకు పంపిస్తున్నారు. ఇది పోలీసింగ్ కాదు, మాఫియా రాజ్యం” అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కూడా అణచివేస్తూ, తప్పుడు కేసులతో విపక్షాలను భయపెడుతున్నారని ఆయన ఆరోపించారు.
గుడివాడ (Gudivada)లో జెడ్పీ చైర్మన్ (ZP Chairman) ఉప్పాల హారిక (Uppala Harika)పై జరిగిన దాడిని జగన్ తీవ్రంగా ఖండించారు. “ఒక్క మహిళపై రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. పోలీసులు చూస్తూ నిలబడ్డారు. ఆమె చేసిన తప్పేంటి?” అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో బీసీ మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే పరిస్థితి లేదని, పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం హామీలను నెరవేర్చకుండా, ప్రజలను మోసం చేస్తూ, ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం ద్వారా అణచివేతకు పాల్పడుతోందని జగన్ ఆరోపించారు. “చంద్రబాబూ ఇప్పటికైనా మేలుకో, తప్పుడు సంప్రదాయాలను సరిదిద్దుకో” అని ఆయన హెచ్చరించారు.