వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేడు ఉమ్మడి విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. తాడేపల్లి నుంచి మాజీ సీఎం బయల్దేరారు. జగన్ పర్యటనపై భారీ ఆసక్తి నెలకొంది. ప్రారంభంలో పర్యటనకు అనుమతి ఇవ్వడంలో జాప్యం చేసిన పోలీసులు, చివరికి కొత్త రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు.
జగన్ ఉదయం 11 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని, అక్కడి నుంచి NAD జంక్షన్, పెందుర్తి, అనకాపల్లి, తాళ్లపాలెం మార్గంగా నర్సీపట్నం మెడికల్ కాలేజ్ వైపు ప్రయాణించనున్నారు. ఈ మార్గంలో భారీగా ప్రజలు, వైసీపీ కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు అప్రమత్తం అయ్యారు. జగన్ పర్యటన మార్గంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, బల్క్ డ్రగ్ పార్క్ నిలిపివేత, నర్సీపట్నం వైద్య కళాశాల నిర్మాణం వంటి కీలక అంశాలపై జగన్ బహిరంగంగా మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రజా సమస్యలపై స్పష్టమైన సందేశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ పర్యటనను వైసీపీ అత్యంత ప్రాధాన్యంగా చూస్తోంది. పోలీసులు సూచించిన మార్గం మారడంతో వైసీపీ “ప్లాన్–బీ”ని అమల్లోకి తెచ్చింది. నగర పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుండి కార్యకర్తలను సమీకరిస్తోంది. కాకాని నగర్‌లో స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసిత కుటుంబాలు, తాళ్లపాలెం వద్ద బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు, మత్స్యకారులతో జగన్ భేటీ కానున్నారు.
పోలీసుల హెచ్చరికలు
అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ.. “ప్రజలు, పార్టీ కార్యకర్తలు హైవేలపై గుంపులుగా గుమికూడరాదు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు. జగన్ పర్యటనలో జనాలు ఎక్కువగా ఉండకూడదన్న పోలీసుల నిబంధనలపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం పర్యటనకు “అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి, ఫ్లెక్సీలు కూడా కట్టనివ్వడం ప్రజాస్వామ్య విరుద్ధం” అని మండిపడుతున్నారు.








