మరికాసేపట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. లిక్కర్ కేసులో నలుగురికి బెయిల్ వచ్చిన తరువాత జగన్ ప్రెస్‌మీట్ జరుగుతుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్‌లో జరగనున్న మీడియా సమావేశంలో మాజీ సీఎం పలు కీలక అంశాలపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నట్లుగా సమాచారం. రైతులు యూరియా కోసం పడుతున్న కష్టాలు, పంటలకు గిట్టుబాటు ధర సమస్యలు, రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వంటి అంశాలపై మాట్లాడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అదేవిధంగా, వేల కోట్ల విలువైన భూముల కేటాయింపుల గురించి కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇక అనంతపురంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వ “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” సభపై కూడా జగన్ ప్రస్తావించనున్నారని అంచనా. పక్కా ఆధారాలతో వచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడతారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇదే రోజు పాలకపక్షం – ప్రతిపక్షం రెండు కీలక సమావేశాలు జరగడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. ఎవరి సభకు ఎక్కువ వీయర్‌షిప్ వస్తుందన్న చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.