‘మావిగన్‌’.. రాజ‌ధానిపై జగన్ ‘ప్లాన్-బి’ ప్రతిపాదన

'మావిగన్‌'.. రాజ‌ధానిపై జగన్ 'ప్లాన్-బి' ప్రతిపాదన

తాను అమ‌రావ‌తితో పాటు రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ వ్య‌తిరేకం కాద‌ని వైసీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. రాజ‌ధాని విష‌యంలో తాము గ‌తంలోనే మ‌రో ప్ర‌తిపాద‌న ప్ర‌భుత్వానికి చేశామ‌ని, వైసీపీ ప్లాన్‌-బీ అంశాన్ని మ‌రోసారి వైఎస్ జ‌గ‌న్ వివ‌రించారు. అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు రాష్ట్రంపై మోపబోతున్న భారీ అప్పుల భారాన్ని అడ్డుకోవడానికి ‘ప్లాన్-బి’గా ‘మావిగన్’ (MAVIGUN) నమూనాను ఆయన సూచించారు.

ఏంటి ఈ ‘మావిగన్’ (MAVIGUN)?
విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం నగరాలను కలుపుతూ ఒక భారీ ఎకనామిక్ కారిడార్‌ను రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేయడమే ఈ ప్లాన్ ఉద్దేశం. మచిలీపట్నం (MA), విజయవాడ (VI), గుంటూరు (GUN).. ఈ మూడు నగరాల పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి ‘మావిగన్’ అని నామకరణం చేశారు. ఒకవేళ ‘గన్’ అంటే జగన్ గుర్తుకొస్తాడన్న భయం చంద్ర‌బాబుకు ఉంటే పేరు మార్చుకోవచ్చని కూడా ఆయన చమత్కరించారు.

జగన్ ప్లాన్‌-బీ ప్రతిపాదన
మచిలీపట్నం నుంచి విజయవాడ (70 కి.మీ), విజయవాడ నుంచి గుంటూరు (40 కి.మీ) వరకు ఉన్న 110 కిలోమీటర్ల నేషనల్ హైవే పరిధిని క్యాపిటల్ ఏరియాగా ప్రకటించాలి. అమరావతిలో గ్రాఫిక్స్ కోసం ఖర్చు చేయాలనుకుంటున్న రూ. 2 లక్షల కోట్లలో కేవలం 10 శాతం (రూ. 20 వేల కోట్లు) ఖర్చు చేసినా చాలు. మ‌చిలీపట్నం పోర్టు, విజయవాడ, గుంటూరు మధ్య రింగ్ రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఇది భవిష్యత్తులో రాష్ట్రానికి అతిపెద్ద ఎకనామిక్ ఇంజిన్‌గా మారుతుంది. వైసీపీ హయాంలోనే మచిలీపట్నం పోర్టుకు అన్ని అనుమతులు తెచ్చి, నిధులు సమకూర్చి పనులు ప్రారంభించామని, చెన్నై, ముంబై తరహాలో ఇది పోర్ట్ సిటీగా ఎదిగే అవకాశం ఉందని జగన్ గుర్తుచేశారు.

చంద్రబాబుపై ప్రశ్నల వర్షం
అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెబుతున్న చంద్రబాబు తీరుపై జగన్ విరుచుకుపడ్డారు. “సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయితే రాజధాని రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఎందుకు ఇస్తోంది?” అని ప్రశ్నించారు. భూములు అమ్మి రాజధాని కడతానని చెప్పి, ఇప్పుడు వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ప్రజలపై భారం వేయడం ఏంటని నిలదీశారు. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు, అమరావతి నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి అయినా ఆదాయం తీసుకువచ్చారా అని అడిగారు.

తాము చెప్పిన ప్రాక్టికల్ ఆలోచనలు చంద్రబాబు ముఠాకు నచ్చడం లేదని, కేవలం స్కాముల కోసమే అమరావతి పేరుతో అప్పులు తెస్తున్నారని జగన్ ఆరోపించారు. రాష్ట్రం బాగుండాలంటే వాస్తవాలకు దగ్గరగా ఉండే ‘మావిగన్’ వంటి ప్లాన్-బి గురించి ఆలోచించాలని ఆయన హితవు పలికారు.

Join WhatsApp

Join Now

Leave a Comment