పులివెందుల పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అకాల వర్షాలతో పంట నష్టపోయిన అరటి రైతులను పరామర్శించారు. నేలకొరిగిన అరటిపంటను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అరటి పంట పూర్తిగా నాశనం కావడంతో పార్టీ తరఫు నుంచి కొంత ఆర్థికసాయం రైతులకు అందిస్తామని ప్రకటించారు.
రైతులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత
వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతుల కోసం కేవలం కపట ప్రేమ చూపిస్తోందని, కానీ నిజమైన సాయం చేయడం లేదని విమర్శించారు. వైసీపీ పాలనలో ఉచిత పంటల బీమా అమలులో ఉండేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ పథకాలను నిలిపివేసిందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయాయని, ఈ పరిస్థితిలో ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా వెంటనే అందించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించి, రైతులకు తక్షణ సాయం అందించాలన్నారు వైఎస్ జగన్.
మూడేళ్లు ఓపిక పట్టండి..
కూటమి అధికారంలోకి వచ్చి మరో రెండు నెలల్లో సంవత్సరం పూర్తవుతుందని, కళ్లు మూసి తెరిచేలోగా మరో మూడుళ్లు గడిచిపోతాయని, మూడేళ్లు ఓపిక పట్టండి.. ఆ తరువాత వచ్చేది వైసీపీ ప్రభుత్వమే.. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు ఇన్సూరెన్స్ సొమ్ము ప్రభుత్వం ఏర్పడిన నెలరోజుల్లోనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
పంట నష్టం..
శనివారం రాత్రి కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షానికి వైఎస్సార్ కడప, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగింది. ముఖ్యంగా అరటి తోటలు నేలకొరిగాయి. వైఎస్సార్ కడప జిల్లాలో 2,460 ఎకరాల్లో పంట నష్టపోగా, అనంతపురం జిల్లాలో 1,400 ఎకరాల అరటి తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. శ్రీసత్యసాయి జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లోనూ రైతులు తీవ్రంగా నష్టపోయారు.








