అనకాపల్లి (Anakapalli) జిల్లా నర్సీపట్నం (Narsipatnam)లో రేపు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) పర్యటించనున్నారు. మొదట జగన్ పర్యటనకు అనుమతులు నిరాకరించినా.. ఇవాళ ఆంక్షలతో కూడిన అనుమతులిచ్చారు. గతంలో హెలిప్యాడ్ ఏర్పాట్లకు అనుమతులివ్వని పోలీసులు.. నర్సీపట్నం పర్యటనకు హెలికాప్టర్‌లోనే రావాలని కోరారు. వైసీపీ రోడ్డు మార్గమేనని పట్టుబట్టడంతో ఆంక్షలు, రూట్ మార్పులతో కూడిన అనుమతులిచ్చారు. అయితే, జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు సైతం అప్రమత్తం అవుతున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు(K.K Raju) మీడియాతో మాట్లాడుతూ, జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అటు అధికారులను, ఇటు కూటమి నేతలను హెచ్చరించారు. అధికార పార్టీ నాయకులపై తీవ్రంగా విమర్శలు గుప్పించిన ఆయన, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పోరాటం చేస్తుందని చెప్పారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీకి అనుమతి లేదని అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) మాట్లాడడం బాధాకరమన్నారు.
కూటమి నేతల ఒత్తిడితో మొదట జగన్ పర్యటనకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. ప్రజల నుంచి భారీ వ్యతిరేక వస్తుండగాన్ని గమనించి పోలీసులతో పర్యటన రూట్ మార్పించి అనుమతిచ్చారన్నారు. అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా జగన్ నర్సీపట్నం వెళ్తారని కేకే రాజు చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వైఎస్ జగన్ కృషి చేశారని, కానీ అధికారులు స్వాగత ఏర్పాట్లను కూడా అడ్డుకుంటున్నారన్నారు. అధికారులు చట్టానికి లోబడి పని చేయాలని, ఎవరైనా హద్దు మీరిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది” అని హెచ్చరించారు.
“ఉత్తరాంధ్ర కూటమి నేతలకు సిగ్గు ఉందా? చంద్రబాబు ఉత్తరాంధ్రను నాశనం చేస్తున్నారు. ఇక్కడి భూములు, సంపదను దోచుకుంటున్నారు. సిగ్గు, శరం ఉంటే ఆయన చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించండి. అధికారులు ఇప్పటికైనా సహకరించాలి. జగన్ పర్యటన విజయవంతం కావడానికి కార్యకర్తలు సన్నద్ధం కావాలి” అని పిలుపునిచ్చారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరించారు. భవిష్యత్‌లో వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీలను సందర్శిస్తారని ఆయన వెల్లడించారు.








