ఏపీ ప్రతిపక్షనేత జగన్ జనంలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. కూటమి ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చిన వైసీపీ అధినేత.. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని, ఇక నుంచి ప్రజల మధ్యే ఉంటూ, ప్రభుత్వంపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉమ్మడి నెల్లూరు జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు.
నెల్లూరు నేతలతో సమావేశంలో కార్యకర్తలకు అండగా ఉంటానని, ఇంత వరకు కార్యకర్తలను ఒకలా చూశాం.. ఇప్పటి నుంచి మరోలా చూస్తామని, అన్యాయం జరిగిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని, వారికి భరోసాగా నిలుస్తానని కీలక వ్యాఖ్యలు చేసిన జగన్.. తాను జనంలోకి వచ్చే సమయంపై క్లారిటీ ఇచ్చారు.
తాను కూడా జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యనటకు వస్తానని ప్రకటించారు జగన్. అక్కడే నిద్ర చేస్తానని, ప్రతి వారంలో మూడు రోజులు మంగళ, బుధ, గురువారాల్లో ఒక పార్లమెంటులో విడిదిచేస్తానని తెలిపారు. ప్రతిరోజూ రెండు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలను కలుసుకుంటానని, మండలస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ పార్టీ బలోపేతం కావాలని, గ్రామస్థాయి కమిటీలు, బూత్ కమిటీలు ఇవన్నీకూడా బలోపేతం కావాలని జగన్ పిలుపునిచ్చారు. జగన్ ప్రకటనతో వైసీపీ శ్రేణు్లో నూతన ఉత్సాహం మొదలైనట్లుగా తెలుస్తోంది. తమ అధినేత ప్రకటనపై సోషల్ మీడియా తెగ పోస్టులు పెడుతున్నారు.