ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ బడ్జెట్‌పై మాజీ సీఎం జగన్ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ప్రెస్‌మీట్ అనంతరం ఓ మీడియా ప్రతినిధి వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే అంశంపై పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారంటూ ప్రశ్న వేశారు.. రిపోర్టర్ ప్రశ్నకు స్పందించిన వైఎస్ జగన్.. పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అని కౌంటర్ వేశారు. జీవితకాలంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు అంటూ వ్యాఖ్యానించారు. పవన్ కామెంట్స్‌కు వైఎస్ జగన్ ఇచ్చిన ఆన్సర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
అసెంబ్లీలో రెండే పక్షాలు ఉంటాయని, ప్రతిపక్షాన్ని గుర్తించకపోతే ఎలా? అని జగన్ ప్రశ్నించారు. ఇంతమంది ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తామనే రూలింగ్ ఎక్కడా లేదని జగన్ తెలిపారు. చంద్రబాబుకు గతంలో ప్రతిపక్ష హోదా ఇచ్చామని జగన్ చెప్పారు. టీడీపీ నుంచి ఐదుగురు పక్కన కూర్చున్నా.. ఇంకా పది మందిని మన పార్టీలోకి లాగుదామని మా వాళ్లు చెబితే నేనే వద్దన్నా. అసెంబ్లీలో ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి.. నేను వింటానని చంద్రబాబుకి చెప్పా. ఇదే ఆయనకు, నాకు ఉన్న తేడా అని జగన్ వివరించారు.








