వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు రద్దు చేసే హక్కు చంద్రబాబుకు లేదని వైసీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. గత ప్రభుత్వం కేటాయించిన పట్టాలను రద్దు చేయాలని ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తే వేల సంఖ్యలో కోర్టు కేసులు ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని హెచ్చరించారు. రద్దు చేసిన ఇళ్ల పట్టాలను టీడీపీ కార్యకర్తలకు ఇచ్చే కుట్ర జరుగుతోందని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని ఆయన తేల్చి చెప్పారు. లబ్ధిదారుల పక్షాన వైసీపీ నిలబడి పోరాడుతుందని చెప్పారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు. పేదల కోసం జగన్ ప్రభుత్వం చేపట్టిన గొప్ప కార్యక్రమాలను చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. వైఎస్ జగన్ రూ.56,102.91 కోట్లు విలువైన 71,811 ఎకరాల భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించి చరిత్ర సృష్టించారని తెలిపారు. వాటిని రద్దు చేసి టీడీపీ కార్యకర్తలకు పంచిపెట్టడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. జగన్ హయాంలో పంపిణీ చేసిన ఇళ్లపట్టాల్లో 80 శాతం పట్టాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించబడ్డాయని గుర్తుచేశారు.
చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు
చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, పేదలకు ఇళ్లు కట్టడం దేవుడెరుగు, సెంటు భూమి కూడా కేటాయించలేదని సుధాకర్‌బాబు ఆరోపించారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుందరమైన కాలనీలను కొనసాగించడం కాకుండా, వాటిని రద్దు చేయడం పేదల పట్ల కూటమి సర్కార్ వివక్ష చూపడమేనని దుయ్యబట్టారు. ఒక్క పేదవాడి ఇంటి పట్టా రద్దు చేసినా, వైసీపీ చట్టపరమైన పోరాటం చేస్తుందని, వేల కేసులు ఎదుర్కొనే పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వానికి తలెత్తుతుందని హెచ్చరించారు.