మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసం, క్యాంపు ఆఫీస్ సమీపంలో అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల నోటీసులకు వైసీపీ స్పందించింది. మాజీ సీఎం భద్రతపై అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వం మారిన వెంటనే వైఎస్ జగన్ నివాసం, క్యాంపు ఆఫీస్ వద్ద ఉన్న బారికేడ్లు, సీసీ కెమెరాలను తొలగించారని, ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరిగిందని వైసీపీ పోలీసులకు తెలిపింది.
ఫిబ్రవరి 5వ తేదీన మాజీ సీఎం నివాస సమీపంలోని గార్డెన్‌లో రెండు చోట్ల అగ్ని ప్రమాదం జరిగిందని, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని వైసీపీ తెలిపింది. అగ్ని ప్రమాద ఘటనపై ఫిర్యాదు చేసిన తమకే పోలీసులు నోటీసులు ఇవ్వడం విచిత్రంగా ఉందని, ప్రభుత్వం మారిన వెంటనే సీసీ కెమెరాలను తొలగించారని పేర్కొంది. అగ్ని ప్రమాద ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై వైసీపీ అనుమానాలు వ్యక్తం చేసింది.
మాజీ క్యాంపు ఆఫీస్ రోడ్డులోకి అన్ని రకాల వాహనాలకు అనుమతి ఇచ్చారని, ఘటన జరిగిన సమయంలో రోడ్డుపై ఏయే వాహనాలు నిలిపి ఉన్నాయో తమ వద్ద సమాచారం లేదని వైసీపీ ప్రతినిధులు పోలీసులకు వివరించారు. సీసీ కెమెరాలకు సంబంధించిన సామగ్రి మొత్తం గతంలోనే అధికారులు తీసుకువెళ్లారని, ఆ డేటా అందుబాటులో లేదని చెప్పారు.