పెన్షన్లు అందుకుంటున్న పండుటాకులపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెన్షన్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఏకంగా మూడు లక్షల పెన్షన్ లను తొలగించిందని, భవిష్యత్తులో పెన్షన్లపై భారీ కోతకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
వైసీపీ పాలనలో 66,34,742 పెన్షన్లు
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మల్లాది విష్ణు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 66,34,742 పెన్షన్లు పంపిణీ చేస్తూ వచ్చింది. అందుకోసం ప్రభుత్వం ఏకంగా రూ.92,547.66 కోట్లు వెచ్చించిందన్నారు. వైసీపీ పాలనలో వలంటీర్ల ద్వారా ఆదివారం అయినా, సెలవు రోజైనా, పండగ రోజు అయినా సరే, తెల్లవారుజామునే ఇంటి తలుపు తట్టి పెన్షన్లు పంపిణీ చేయించామన్నారు.
ఆరునెలల్లో 3 లక్షలపైగా పెన్షన్ల కోత
పెన్షన్లు ఒక చేత్తో ఇస్తున్నట్లు నటిస్తూ.. మరో చేత్తో కోత పెట్టే ప్రయత్నాలు చంద్రబాబు ప్రారంభించాడని, జూన్ నుంచి ప్రతి నెలా పెన్షన్లు తగ్గిస్తూ వచ్చారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల్లోనే ఏకంగా 3 లక్షలకు పైగా పెన్షన్లు కట్ చేశారన్నారు. ఎన్నికలు జరిగిన నాటికి వైసీపీ ప్రభుత్వ హయాంలో 66,34,742 పెన్షన్లు ఉంటే.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ డిసెంబరు నాటికి వాటి సంఖ్య 63,20,282 పెన్షన్లకు తగ్గించారన్నారు. ఆరు నెలల్లో ఏకంగా 3 లక్షలకు పైగా పెన్షన్లు తగ్గించారని మల్లాది విష్ణు చెప్పారు.
వైసీపీకి మద్దతు పలికారని తొలగింపు
వైసీపీకి మద్దతు పలికారని.. వృద్దులని కూడా చూడకుండా పెన్షన్లు తొలగించారన్నారు. జాబితాలో కొందరి పేర్లున్నా వారికి పింఛన్లు ఇవ్వడంలేదన్నారు. తామున్న సచివాలయ పరిధి నుంచి ఇతర జిల్లాలకు బదిలీ చేస్తుండడంతో పింఛన్లు తెచ్చుకునేందుకు వీలుకాక కొందరు ఇబ్బందులు పడుతుండగా.. అసలు తమ పింఛన్ ఏ జిల్లాలో ఉందో తెలీక చాలామంది సతమతమవుతున్నారన్నారు.
మంత్రి గొట్టిపాటి నియోజకవర్గంలో అరాచకం
పెన్షన్లు ఆపడం, ఇతర జిల్లాలకు బదిలీ చేయడం, పార్టీలు మారితే కానీ పెన్షన్ ఇవ్వము అనేది మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న అద్దంకి నియోజకర్గంలో జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మంత్రి ఆదేశాలతో ఇక్కడి పచ్చనేతలు బరితెగించి పండుటాకులను కాల్చుకు తింటున్నారని ఆరోపించారు.