ఫీజు కట్టలేదని శ్రీచైతన్య కాలేజీ విద్యార్థిని అర్ధరాత్రి బయటకు గెంటేసిన ఘటనపై వైసీపీ సీరియస్ అయ్యింది. విద్యార్థుల పట్ల ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తున్న కాలేజీపై చర్యలు ఎందుకు లేవని నిలదీసింది. ఫీజుల పేరుతో విద్యార్థులను ఆర్థికంగా, మానసికంగా వేధిస్తున్న చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ కాలేజీల అరాచకాలను కట్టడి చేయకుండా ప్రభుత్వం చేతులెత్తేసిందని వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీల యాజమాన్యాల ఫీజుల పెంపు, అక్రమ వసూళ్లను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.
కార్పొరేట్ కాలేజీల దోపిడీ..
ఇంకో రెండు నెలల్లో వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యే సమయంలో చైతన్య మరియు నారాయణ కాలేజీలు ఫీజుల పేరుతో విద్యార్థులను తీవ్రంగా వేధిస్తున్నాయని, ఫీజులు చెల్లించని విద్యార్థులను క్లాసులకు అనుమతించకుండా గేటు వద్ద ఆపేస్తున్నారని రవిచంద్ర మండిపడ్డారు. విజయవాడలోని శ్రీచైతన్య గోశాల క్యాంపస్లో, ఫీజులు చెల్లించినప్పటికీ మరింత డబ్బు కోసం గౌతమ్ అనే విద్యార్థిని గేటు బయటకు పంపించడం అమానుషమని రవిచంద్ర అన్నారు.
ఫీజుల నియంత్రణ ఎక్కడ?
గతంలో వైసీపీ ప్రభుత్వం ఫీజుల నియంత్రణ కోసం కమిషన్ ఏర్పాటుచేసి ఫీజుల దోపిడీని అరికట్టిందని రవిచంద్ర గుర్తుచేశారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కాలేజీల అధిక ఫీజుల అరాచకాలు మరింత పెరిగిపోయాయి. లోకేశ్ నాయకత్వంలోని ప్రభుత్వం ఈ వ్యవస్థపై నియంత్రణలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
వైసీపీ హెచ్చరిక
కార్పొరేట్ కాలేజీలు తక్షణం తమ విధానాలు మార్చకపోతే, వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తామని రవిచంద్ర హెచ్చరించారు. బాధిత విద్యార్థుల పక్షాన చర్యలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఫీజుల నియంత్రణ కమిటీని తక్షణం ఏర్పాటు చేయాలని, అక్రమ వసూళ్లతో విద్యార్థులను వేధించే కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.